మట్కా డైరెక్టర్.. విడుదలకు ముందే పొరపాటు
‘పలాస 1978’ అనే మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన టాలెంటెడ్ రైటర్ కరుణ కుమార్.
‘పలాస 1978’ అనే మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన టాలెంటెడ్ రైటర్ కరుణ కుమార్. తక్కువ బడ్జెట్ తో శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమాని చాలా రియలిస్టిక్ గా తెరపై ఆవిష్కరించి కరుణ కుమార్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలను హీరోలను కూడా అతను ఎట్రాక్ట్ చేశాడు. ఇక తరువాత సుధీర్ బాబు లాంటి టాలెంటెడ్ యాక్టర్ కరుణ కుమార్ కి అవకాశం ఇచ్చారు. అతనితో ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ చేసిన కరుణ కుమార్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి.
తరువాత సత్యం రాజేష్ తో ‘కళాపురం’ అనే సినిమాని ఈయన చేశారు. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. చాలా చిన్న కథని ఏదో ఆసక్తికర ఎలిమెంట్స్ ఉన్నట్లు తెరపై ఆవిష్కరించినా ప్రేక్షకులు ఆదరించలేదు. ఇలా వరుసగా రెండు ఫ్లాప్ లతో ఉన్నా కూడా కరుణ కుమార్ కి ఊహించని విధంగా వరుణ్ తేజ్ తో ‘మట్కా’ చేసే అవకాశం లభించింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏకంగా 40+ కోట్ల వరకు మూవీకి పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
కంప్లీట్ గా పీరియాడిక్ జోనర్ లో వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని కరుణ కుమార్ తెరకెక్కించారు. అందుకే ఒకప్పటి నేటివిటీ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా సెట్స్ వేసి షూటింగ్ కంప్లీట్ చేశారు. కొన్ని సీక్వెన్స్ మాత్రమే అవుట్ డోర్ లో షూట్ చేశారు. ఇదిలా ఉంటే నవంబర్ 14న ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. మొదటి ఆట నుంచి సినిమాకి డివైడ్ టాక్ మొదలయ్యింది. మరల ఈ మూవీ ఎక్కడా కోలుకోలేదు.
వరుణ్ తేజ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మూడు పాత్రలలో వేరియేషన్స్ చూపిస్తూ నటించాడు. అయితే కథ, కథనం చాలా స్లో గా ఉన్నాయని, స్క్రీన్ ప్లే ఎక్కడా ఎంగేజ్ చేయలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘పలాస’ తర్వాత వచ్చిన రెండు ఫ్లాప్ లకి కరుణ కుమార్ దగ్గర ఏవో రీజన్స్ ఉన్నాయి. అయితే ‘మట్కా’ మూవీ కచ్చితంగా 20 దశాబ్దాలు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుందని కరుణ కుమార్ ప్రమోషన్స్ లో చెప్పారు. హీరో, నిర్మాత ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని ఇంటర్వ్యూలలో చెప్పారు.
వరుణ్ తేజ్ కూడా వరుస ఫ్లాప్ ల నుంచి ‘మట్కా’ తో మరల గాడిలో పడతానని అనుకున్నాడు. కచ్చితంగా తన కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుందని అనుకున్నాడు. అయితే అతని నమ్మకాన్ని ‘మట్కా’ నిలబెట్టలేకపోయింది. ఈ సినిమా ఎగ్జిక్యూషన్ లో జరిగిన లోపాలు ఏంటనేది దర్శకుడు కరుణ కుమార్ కచ్చితంగా పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
కరుణ కుమార్ లో మంచి రచయిత ఉన్నాడు. ఆయనకి సాహిత్యం పైన మంచి పట్టు ఉంటుంది. కానీ మట్కాలో అసలైన మ్యూజిక్ తో జనాలను ఎట్రాక్ట్ చేయలేదు. పలాసా మూవీలో నెక్కిలేసు గొలుసు ద్వారా ఆ సినిమాకు సరిపడా క్రేజ్ దక్కింది. ఇక మట్కా విషయంలో మ్యూజిక్ పై ఇంకాస్త శ్రద్ధ చూపాల్సింది.
ఇక థియేటర్ కు వచ్చిన జనాల నుంచి కూడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో మరింత దెబ్బ పడింది. కథ కంటెంట్ విషయంలోనే కాకుండా సినిమాను చూడాలనే ఆసక్తి కూడా బలంగా క్రియేట్ చేయాల్సిన బాధ్యత దర్శకుడిపై ఉంటుంది. ఆ రూట్లో కరుణకుమార్ వర్క్ కనిపించలేదు. మరి తదుపరి ప్రాజెక్టు విషయంలో అయినా అతను ఈ పొరపాటు జరక్కుండా చూస్కుంటాడో లేదో చూడాలి.