డైరెక్టర్ క్రిష్ వివాహం.. వధువు ఎవరంటే?
ఆయన త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులు ఎంతమంది ఉన్నా కూడా మంచి కంటెంట్ తో మెప్పించే మేకర్స్ కొందరు మాత్రమే ఉన్నారు. అలాంటి మంచి టాలెంటెడ్ దర్శకులలో క్రిష్ ఒకరు. విభిన్నమైన కాన్సెప్ట్ లతో మంచి సందేశం ఇచ్చే క్రిష్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం క్రిష్ ‘ఘాటీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. అందాల నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రీసెంట్ గా విడుదలైంది.
ఇక ఆ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. క్రిష్ తన ప్రొఫెషనల్ కెరీర్ లో మంచి విజయాలు అందుకుంటూనే, వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణానికి సన్నద్ధం అవుతున్నారు. ఆయన త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. క్రిష్‌కు ఇది రెండో పెళ్లి కాగా, ప్రీతి చల్లాకు కూడా ఇది రెండో వివాహమే. ప్రీతి గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌గా చల్లా హాస్పిటల్స్‌లో సేవలందిస్తున్నారు.
ఆమె వైద్య కుటుంబంలో నాలుగో తరం వైద్యురాలు కావడం విశేషం. వీరి వివాహం నవంబర్ 10న జరగనుంది. అనంతరం నవంబర్ 16న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహిస్తారని, దానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారని టాక్. క్రిష్ గతంలో రమ్య అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్నారు, కానీ 2018లో ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో విడాకులు పొందారు. ఆ తర్వాత క్రిష్ సింగిల్‌గా ఉన్నారు. ఇప్పుడు మరోసారి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.
ఇక క్రిష్ ఘాటీ సినిమా కంటే ముందే హరి హర వీర మల్లు అనే భారీ పీరియాడిక్ చిత్రాన్ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అది చివరి దశలో ఉండగా కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ బాధ్యతలను ఏఎం రత్నం తనయుడు తీసుకున్నాడు. ప్రస్తుతం క్రిష్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘాటీ సినిమాపై పూర్తిగా దృష్టి సారించారు. ఇప్పటివరకు తెలుగులో పలు విభిన్న జానర్లలో సినిమాలు తీసి మెప్పించిన క్రిష్, తన కొత్త ప్రయాణంతో కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అడుగు వేస్తున్నాడు. ఇక అతను ఘాటీ సినిమా అనంతరం ఏ స్టార్ తో వర్క్ చేస్తారో చూడాలి.