'కల్కి'లో కొన్ని మిస్టేక్స్, లోపాలు ఉన్నాయన్న డైరెక్టర్!

'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్‌ అశ్విన్‌.. రెండో సినిమా 'మహానటి'తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు.

Update: 2024-07-06 09:48 GMT

'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్‌ అశ్విన్‌.. రెండో సినిమా 'మహానటి'తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. రెండో వారంలోనూ మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ లోని కల్కి సెట్స్ లో మీడియా మీట్ నిర్వహించారు దర్శకుడు నాగి. ఈ సందర్భంగా మిక్స్డ్ రెస్పాన్స్ పై, ప్రభాస్ పాత్ర నిడివి తక్కువగా ఉందనే కామెంట్స్ పై సానుకూలంగా స్పందించారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ''మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంత గొప్ప సక్సెస్ అందించినందుకు అందరికీ థాంక్స్. ఇది ఇండస్ట్రీ సక్సెస్ గా నేను భావిస్తున్నాను. ఎన్నో ప్రొడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ధైర్యాన్ని ఇచ్చింది. సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్ రాసుకునే దర్శక రచయితలకు 'కల్కి' సినిమా రిఫరెన్స్ పాయింట్ లా ఉంటుంది. కలెక్షన్స్ గురించి పక్కన పెడితే, గత వారం రోజులుగా అందరూ మంచి సినిమా చేసావని అభినందిస్తున్నారు. సినిమాలో మిస్టేక్స్, చిన్న చిన్న లోపాలు ఉన్నాయని చెప్పారు. నేను కాదనను. కొన్ని మాకు ముందే తెలుసు.. కొన్నిటిని మేం అసలు ఊహించలేకపోయాం. ఏదేమైనా మూడు గంటలకు పైగా ఉన్న ఒక పెద్ద సినిమా మెజారిటీ వర్గానికి నచ్చింది. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే మాట అందరి నోటా వినిపిస్తోంది. థియేటర్స్ లోకి వెళ్లి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని పొందడం సినిమా ముఖ్య ఉద్దేశం. దానికి టీమ్ అంతా సంతోషంగా ఉంది'' అని అన్నారు.

కల్కి పార్ట్ 1లో ప్రభాస్ స్క్రీన్ టైమ్‌ తక్కువగా ఉందనే విషయాన్ని నాగ్ అశ్విన్ అంగీకరించారు. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ''కల్కి అనేది చాలా పెద్ద సబ్జెక్ట్.. చాలా క్యారెక్టర్స్ వుంటాయి. ఇవన్నీ చూపించాలి. పార్ట్ 1లో కల్కి వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంతా అయిపోయింది. ఆడియన్స్ కి ఆ ప్రపంచం పరిచయం అయింది. ఎవరి పాత్రలు ఏంటనేది తెలిసిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ప్రపంచానికి తీసుకెళ్లినా, ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకొని దానిలోకి ఎంటర్ అవుతారు. ఎవరి పాత్రలు ఏంటి? మెయిన్ క్యారెక్టర్స్ పవర్స్ ఏంటి? ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరికి ఏం కావాలి? అనేది తెలిసింది. కాబట్టి ఇకపై వాళ్ళకి ఇంకా ఫన్ గా వుంటుంది'' అని నాగ్ అశ్విన్ తెలిపారు.

కల్కి లాంటి పెద్ద కథకు, దాంట్లోని పాత్రలకు న్యాయం చేయలనే ఉద్దేశంతోనే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపిక పదుకునే లాంటి స్టార్ యాక్టర్స్ ని తీసుకున్నామని నాగ్ అశ్విన్ తెలిపారు. ఏదొక ప్రాంతానికి చెందిన సినిమాగా కాకుండా, ఒక కంప్లీట్ ఇండియన్ సినిమాగా అందరూ గర్వంగా చెప్పుకునే విధంగా ‘కల్కి 2898 ఏడీ’ని తీయాలనే ఆలోచనతోనే అన్ని భాషల నటీనటులను తీసుకున్నట్లుగా చెప్పారు. అందుకే తెలుగు, తమిళ్, పంజాబీ, మరాఠీ, మలయాళంతో పాటుగా నార్త్ ఈస్ట్ యాక్టర్స్ ను తీసుకున్నట్లుగా తెలిపారు.

‘కల్కి 2898 AD’ లో సంగీతం ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ రావడంపై నాగి స్పందిస్తూ.. “మ్యూజిక్ కొన్ని చోట్ల ఎక్ట్రార్డినరీగా ఉంది.. ఇంకొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఆ బ్యాలన్స్ సరిగ్గా రాలేదు” అని అన్నారు. పార్ట్ 2లో సంగీతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. ఇలా మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు నాగ్ అశ్విన్ చాలా కూల్ గా సమాధానాలు ఇచ్చారు. సినిమాపై విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకొని, తనదైన శైలిలో స్పందించారు.

Tags:    

Similar News