ఇంట గెలిచి రచ్చ గెలిచాడు.. రియల్ పాన్ ఇండియా స్టార్!
మంచి సినిమాను ప్రేమించడంలో ఎవరైనా తెలుగు ప్రేక్షకుల తర్వాతే అని అంటుంటారు.
మంచి సినిమాను ప్రేమించడంలో ఎవరైనా తెలుగు ప్రేక్షకుల తర్వాతే అని అంటుంటారు. కంటెంట్ నచ్చితే చాలు, మనోళ్లు ఏ భాష అనేది పట్టించుకోకుండా నెత్తిన పెట్టుకుంటారు. నచ్చితే చాలు పరభాషా నటులను కూడా అభిమానించడం మొదలు పెడతారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ మలయాళ హీరో అని చెబితే, అవునా.. అని ఒక్క క్షణం ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే, అతన్ని తెలుగు ఆడియెన్స్ ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం అవుతుంది.
సాధారణంగా ఏ హీరోకైనా తన సొంత భాషలో కంటే, ఇతర ఇండస్ట్రీలలో ఎక్కువ ప్రేమ లభిస్తుందని అనుకోలేం. కానీ మలయాళీ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ విషయంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. మాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాదు, తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
'ఓకే బంగారం' అనే తమిళ డబ్బింగ్ సినిమాతో తొలిసారిగా తెలుగు తెర మీదకి వచ్చిన దుల్కర్ సల్మాన్.. 'మహానటి' చిత్రంతో నేరుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించాడు. దీంతో ఆయన నటించిన 'కనులు కనులను దోచాయంటే' అనే అనువాద చిత్రానికి కూడా ప్రేక్షకాదరణ దక్కింది. ఆ తర్వాత 'సీతారామం' సినిమాతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. లేటెస్టుగా 'లక్కీ భాస్కర్' మూవీతో మరో ఘన విజయాన్ని తన అకౌంట్ లో వేసుకున్నాడు డీక్యూ.
దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమాకి ప్రీమియర్ షోల నుంచే హిట్ టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి మూడు రోజుల్లోనే రూ. 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దుల్కర్ సల్మాన్ తన మదర్ లాంగ్వేజ్ లో చేసిన సినిమాలకు కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఎప్పుడూ రాలేదు. కానీ తెలుగులో నటించిన మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబట్టాయి. ఒకవేళ 'లక్కీ భాస్కర్' మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరితే టాలీవుడ్ లో అతనికి ఇంక తిరుగుండదు.
నిజానికి దుల్కర్ సల్మాన్ కు మలయాళ, తెలుగు భాషలతో పాటుగా.. తమిళ, హిందీ భాషల్లోనూ మంచి క్రేజ్ వుంది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాలు చేసాడు. ఏ భాషలో సినిమా చేస్తే, ఆ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం దుల్కర్ ఒక్కరికే చెల్లింది. ఇండియన్ సినిమాలో అన్ని లాంగ్వేజ్ లలో ఫుల్ డిమాండ్ ఉన్న యాక్టర్ గా రాణిస్తున్నాడు కాబట్టి, అతన్ని 'రియల్ పాన్ ఇండియా స్టార్' అని పిలవొచ్చు.