సినీ 'దసరా'.. బాక్సాఫీస్ వద్ద 'ఢీ' అంటే 'ఢీ'!

శివరాత్రి, హోలీ తదితర పండగలకూ బాక్సాఫీస్ వద్ద పలు మూవీస్ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

Update: 2025-02-20 12:31 GMT

ఏ పండుగ వచ్చినా.. కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఇది కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. రీసెంట్ గా సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. శివరాత్రి, హోలీ తదితర పండగలకూ బాక్సాఫీస్ వద్ద పలు మూవీస్ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

అయితే ఇప్పుడు దసరా బాక్సాఫీస్ వార్ కోసం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కన్నడ నటుడు రిషభ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న కాంతార చాప్టర్‌ 1.. అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన కాంతారకు ప్రీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది.

అదే సమయంలో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఒకటైన రాజా సాబ్ ను కూడా అప్పుడే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్.. చాలా రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.

కానీ కొన్ని కారణాల వల్ల రాజా సాబ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీంతో ఏప్రిల్ 10 నుంచి అక్టోబర్ కు రిలీజ్ ను షిఫ్ట్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. హారర్ కామెడీ జోనర్ లో రాజా సాబ్ వస్తుండడంతో ఆ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో రాజా సాబ్, కాంతార 1 మధ్య క్లాష్ తప్పక ఉంటుంది!

అయితే బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవం ప్రాజెక్టును సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే సమయంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అప్ కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టు మూవీ రిలీజ్ కానుంది. ఈ రెండింటిపై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద అదరగొడితే.. థియేటర్లలో పాతుకుపోతాయి. దీంతో అప్పుడు దసరా పోటీ ఉత్కంఠగా మారిపోయే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది. ఒకవేళ అలా జరిగితే రాజా సాబ్ రిలీజ్ వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే అక్టోబర్ 16న రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా రిలీజ్ అవ్వనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి దసరాకు ఏ ఏ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News