శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా ఆస్తులపై ED సోదాలు
శిల్పా శెట్టి సహా కుంద్రా అతడి సహచరుల ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి.
మొబైల్ యాప్‌ల ద్వారా వయోజన (అడల్ట్) కంటెంట్ ఉత్పత్తికి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. శిల్పా శెట్టి సహా కుంద్రా అతడి సహచరుల ఆస్తులపై సోదాలు జరుగుతున్నాయి. విచారణలో కుంద్రాకు బిట్‌కాయిన్ మోసంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. శెట్టికి ఆస్తిని కొనుగోలు చేసి, బదిలీ చేయడానికి కుంద్రా అక్రమ నిధులను ఉపయోగించినట్లు అధికారులు ఆరోపించారు.
ఈడీ ఆపరేషన్‌లో భాగంగా శిల్పా-కుంద్రా దంపతుల నివాసం, కేసులో చిక్కుకున్న ఇతర వ్యక్తుల ఆస్తులలో సోదాలు సాగుతున్నాయి. రాజ్ కుంద్రాను గతంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అడల్ట్ కంటెంట్ కేసులో అతడు 2021లో అరెస్టు కాగా, ఆ తరువాత బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత బయటకు వచ్చిన కుంద్రా ఒక సెటైరికల్ సినిమాలో నటించారు. అలాగే ముఖానికి మాస్క్ పెట్టుకుని వీధుల్లో తిరగడం ఆశ్చర్యపరిచింది.
బిజినెస్ మేన్ అజయ్ భరద్వాజ్‌కు సంబంధించిన బిట్‌కాయిన్ మోసానికి సంబంధించిన ప్రత్యేక మనీలాండరింగ్ దర్యాప్తులో కూడా కుంద్రా- శిల్పా దంపతులపై విచారణ సాగుతోంది. బిట్‌కాయిన్ కేసులో తన భార్యకు యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి ముందు కుంద్రా ఫ్లాట్‌ను కొనేందుకు అక్రమ నిధులను వినియోగించారనేది ప్రధాన ఆరోపణ. అక్రమ నిధులతో కొన్నారని ఆరోపణలున్న శిల్పా శెట్టి జుహు ఆస్తిని ఈడీ ఇప్పటికే వారి నుంచి లాక్కుంది. వీలున్న అన్ని మార్గాల్లోను రాజ్ కుంద్రాను ఈడీ విచారిస్తోంది.
కుంద్రాపై ప్రధాన ఆరోపణలు:
వయోజన(అడల్ట్) కంటెంట్ కేసుకు సంబంధించి అనుచిత కంటెంట్ ని రూపొందించడంలో రాజ్ కుంద్రా ప్రమేయం ఉందని ఆరోపణలున్నాయి. అతడు భారతీయ శిక్షాస్మృతి, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నివారణ) చట్టం , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సహా పలు చట్టపరమైన నిబంధనల కింద అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.
బ్రిటన్‌లో తీగ లాగితే..!
హాట్‌షాట్స్ అప్లికేషన్ ద్వారా అడల్ట్ వీడియోలను స్ట్రీమింగ్ చేయడానికి కుంద్రా సులభతరం చేశారనే ఆరోపణలపై దర్యాప్తు సాగుతోంది. ఆరోపణల అనంతరం హాట్ షాట్స్ ను ఆపిల్ - గూగుల్ మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించాయి. తన వయాన్ ఇండస్ట్రీస్ కార్యాలయం నుండి పనిచేస్తున్న కుంద్రా బ్రిటన్ - ఆధారిత కంపెనీ కంటెంట్ సరఫరాను నిర్వహించినట్లు కథనాలొచ్చాయి. అతడి ఐటి డైరెక్టర్, ర్యాన్ థోర్ప్ లను విచారిస్తూ.. అప్లికేషన్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు పర్యవేక్షించారు. 2019లో తాను హాట్‌షాట్స్‌ను 25,000 అమెరికన్ డాలర్లకు విక్రయించానని, ఆర్మ్స్ ప్రైమ్ మీడియాను స్థాపించానని కుంద్రా అధికారులకు తెలియజేశారు.