ఢిల్లీ ఎన్నికలు : తల్లడిల్లేది ఎవరు ?

ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2025-01-07 21:30 GMT

ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి జరిగే ఈ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 8న విడుదల చేస్తారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ని ఈ నెల 10న రిలీజ్ చేస్తారు.

మొత్తానికి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించేసింది. అంటే ఒక విధంగా చెప్పాలీ అంటే తాంబూలాలు ఇచ్చేశారు. ఇక ఎన్నికల సమరంలో పోరాడాల్సింది నెగ్గాల్సింది ఎవరో పార్టీలు చూసుకుంటాయి. ఎవరిని గెలిపించాలో జనాలు చూసుకుంటారు.

ఢిల్లీ ఎన్నికలలో మూడు రాజకీయ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. 2013 దాకా ఏకంగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఈసారి ఒంటరిగానే పోటీ పడుతోంది. గత 11 ఏళ్లుగా ఢిల్లీని ఏకపక్షంగా ఏలిన అధికార పార్టీ ఆప్ సైతం ఇండియా కూటమితో సంబంధం లేదని చెప్పి సొంతంగానే పోటీ పడుతోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఢిల్లీ పీఠం కొట్టాలి అన్న బలమైన పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఢిల్లీలో ఈసారి కమల వికాసం తప్పదని బీజేపీ ధీమాగా ఉంది. ఎందుకంటే బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం ఏడు పార్లమెంట్ సీట్లూ కైవశం చేసుకుని స్వీప్ చేసింది. ఒక్క సీటు కూడా ఆప్ కి దక్కలేదు.

ఇదే బీజేపీ 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు మాత్రమే సాధించింది. మొత్తం 70 సీట్లకు గానూ 62 సీట్లను ఆప్ గెలుచుకుని అద్వితీయ విజయం దక్కించుకుంది. అంతే కాదు ఆప్ కి ఆ ఎన్నికల్లో 53.57 శాతం ఓటు షేర్ దక్కింది. బీజేపీకి 38.51 ఓటు షేర్ లభించింది.

ఇంతటి భారీ తేడాతో ఆప్ ఢిల్లీ పీఠాన్ని సాధించి అరవింద్ కేజ్రీవాల్ నాలుగవ సారి ఢిల్లీకి సీఎం అయ్యారు. మరి అయిదేళ్ళు తిరిగేసరికి ఎందుకు ఇలాంటి ఫలితాలు వచ్చాయన్న చర్చ రావచ్చు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఢిల్లీలో గెలిచింది. కానీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయ కేతనం ఎగురవేసింది.

ఇపుడు చూస్తే అదే రిపీట్ అవుతుంది అన్న ధీమాతో ఆప్ ఉంది. ఇక పోటీ ప్రధానంగా ఆప్ బీజేపీల మధ్యనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దగా పెర్ఫార్మ్ చూపించలేదని అంటున్నారు. ఆప్ కి అనుకూలించే అంశాలు ఏవి అంటే అరవింద్ కేజ్రీవాల్ ని జైలులో అనేక నెలల పాటు ఉంచడం. అది ఆయనకు సానుభూతిగా మారుతుంది అని అంటున్నారు.

ఆప్ గెలిస్తే అరవింద్ కేజ్రీవాల్ సీఎం అవుతారు అన్న అంచనా ఉంది. ప్రజలకు ఆ సంగతి ఆప్ కూడా చెబుతూ బీజేపీని ఎవరు మీ సీఎం అని ప్రశ్నిస్తోంది. ఇక ఆప్ కి సంస్థాగతంగా బలం చాలా ఉంది. దాంతో పాటు విద్యావంతులు మధ్యతరగతి వర్గాలలో ఆప్ పట్ల ఇంకా గురి ఉంది. దాంతో పాటు ఆప్ అయిదేళ్ళుగా చేసిన అభివృద్ధి కూడా చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా క్రేజ్ ఉన్న నేతగా అరవింద్ కనిపిస్తున్నారు. దాంతో తమకు పోటీయే లేదు అని ఆప్ ధీమాగా ఉంది.

బీజేపీ విషయం తీసుకుంటే బహు నాయకత్వం సమస్యగా ఉంది. ఈ రోజుకీ ఫలానా వారు ఢిల్లీ సీఎం అవుతారని చెప్పలేకపోతోంది. అయితే బీజేపీ అనేక రాష్ట్రాలలో ఇదే విధానంతో ఉంది. కాబట్టి పార్టీయే ఇక్కడ ముఖ్యమని భావిస్తోంది. పార్టీ పట్ల జనాలు సానుకూలంగా ఉన్నారు అని నమ్ముతోంది.

కేజ్రీవాల్ క్రేజ్ ఈసారి ఏ మాత్రం పనిచేయదని భావిస్తోంది. లిక్కర్ స్కాం తరువాత ఆయన ఇమేజ్ దెబ్బ తిందని కూడా లెక్క కడుతోంది. ఢిల్లీలో జరిగిన అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎక్కువగా ఉందని ప్రచారం చేస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని కూడా జనానికి చెబుతోంది తాము అధికారంలోకి వస్తే ఏమి చేయగలమో వివరిస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు అర్ధబలం అంగబలం అన్నీ తమకు బాగా కలసివస్తాయని భావిస్తోంది. ఇక 11 ఏళ్ల నుంచి పాలించడం వల్ల యాంటీ ఇంకెంబెన్సీ భారీగా ఉంటుందని అలా తమ వైపు జనాలు టర్న్ అవుతారని కూడా బీజేపీ అంచనా వేసుకుంటోంది. ఈసారి జనాలు మార్పు కోరుకుంటున్నారని కూడా భావిస్తోంది. మొత్తానికి చూస్తే ఢిల్లీలో గెలిచేది ఎవరు తల్లడిల్లేది ఎవరు అన్నది ఫిబ్రవరి 8న తేలనుంది.

Tags:    

Similar News