అమరన్ మేకర్స్ రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి..!
ప్రస్తుతం ఈ విషయం చిత్ర యూనిట్ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మూడు వారాలు దాటిన తర్వాత కూడా డీసెంట్ వసూళ్లను రాబడుతూనే ఉంది. రూ.100 కోట్ల వసూళ్లు రాబడితే గొప్ప విషయం అనుకున్న అమరన్ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. లాంగ్ రన్‌లో మరో వంద కోట్లు, అంతకు మించి రాబట్టినా ఆశ్చర్యం లేదు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌గా ఏదో ఒక వార్తతో మీడియాలో ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతూనే ఉంది.
ఇటీవల ఒక ఫ్యాన్ మేడ్ రూ.300 కోట్ల పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టర్ యూనిట్ సభ్యులు విడుదల చేసిందని, అందులో సాయి పల్లవి లేదు అంటూ కొందరు తీవ్ర దుమారం లేపే విధంగా ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు ఆ పోస్టర్ ఫ్యాన్ మేడ్ అని తెలిసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అమరన్ సినిమా వల్ల తన ప్రైవసీకి దెబ్బ పడిందని, అందుకు మూల్యంగా రూ.కోటి నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ ఆ ఇంజనీరింగ్ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ విషయం చిత్ర యూనిట్ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారిందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... అమరన్ సినిమా కథలో భాగంగా ఒక ఫోన్ నెంబర్‌ను చెప్పడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ ఇష్యూ ఇప్పుడు నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. ఆ ఫోన్ నెంబర్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్‌దిగా తెలుస్తోంది. ఆ ఫోన్ నెంబర్‌కి ప్రతి రోజు ఎన్నో కాల్స్ వస్తున్నాయట. దాంతో తన ప్రైవసీకి భంగం కలిగిందని, ఆ నెంబర్‌ను సినిమాలో చూపించడం వల్ల తనను ఇబ్బందికి గురి చేయడం మాత్రమే కాకుండా తన యొక్క సమయం చాలా వృదా చేస్తున్నారు అంటూ యూనిట్ సభ్యులపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే లీగల్‌గా నోటీసులు సైతం నిర్మాణ సంస్థకు పంపించడం జరిగింది.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రతిరోజు పదుల సంఖ్యలో కాల్స్ రావడం తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తనకు న్యాయం చేయాల్సిందే అని, తనకు నష్టపరిహారంగా నిర్మాతలు రూ.కోటి చెల్లించాలని, లేదంటే ఈ విషయమై లీగల్‌గా ముందుకు వెళ్తాను అంటూ ఆయన నోటీసులో పేర్కొన్నాడట. ఇప్పటి వరకు అమరన్ మేకర్స్ నుంచి ఈ విషయమై ఎలాంటి స్పందన రాలేదు. సాధారణంగా ఫోన్ నెంబర్స్‌ను వాడే సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ అమరన్ మేకర్స్ ఇంత గుడ్డిగా ఎలా ఆ నెంబర్ వాడి ఉంటారు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమరన్ సినిమా మరోసారి ఫోన్ నెంబర్ కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది, అతడికి మేకర్స్ నష్టపరిహారం చెల్లించే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.