ఓడి గెలిచిన నటుడు.. హ్యాపీ బర్త్ డే ఫహాద్..!
అయితే తొలి సినిమా చేదు అనుభవం మిగల్చడం వల్ల ఫహాద్ ఫాజిల్ చాలా అవమానాలు ఎదుర్కొన్నారట
మలయాళ నటుల్లో ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఫహాద్ ఫాజిల్. తనకు ఇచ్చిన ఎలాంటి పాత్ర అయినా సరే చేసి ఆడియన్స్ ని మెప్పిస్తున్న ఫహాద్ ఫాజిల్ కెరీర్ ఎలా మొదలైంది.. అసలు అతని నేపథ్యం ఏంటి అన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటారు. ఫహాద్ ఫాజిల్ తండ్రి ఒక డైరెక్టర్ మలయాళంలో సినిమాలు తీస్తూ పేరు తెచ్చుకున్న ఆయన కొడుకు ఫహాద్ ని హీరోగా పరిచయం చేశారు. నటన మీద ఆసక్తి ఉన్న ఫహాద్ 19 ఏళ్ల వయసులోనే హీరోగా మొదటి సినిమా చేశారు.
అయితే తొలి సినిమా చేదు అనుభవం మిగల్చడం వల్ల ఫహాద్ ఫాజిల్ చాలా అవమానాలు ఎదుర్కొన్నారట. ఫహాద్ ఫాజిల్ నటించిన కైయెతుమ్ దూరత్ అంచనాలను అందుకోలేదు. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు ఫహాద్. తొలి సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఆ టైం లో తనని కామెంట్ చేసిన వారిని చూసి భయపడిపోయాడట ఫహాద్ ఫాజిల్. అందుకే 7 ఏళ్లు గ్యాప్ ఇచ్చి మళ్లీ తిరిగి ప్రయత్నం చేశారు.
ఇక రీ ఎంట్రీలో ఫహాద్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. నటుడిగా తనని తాను సినిమా సినిమాకు గెలుచుకుంటూ సౌత్ ఆడియన్స్ మనసు గెలిచారు ఫహాద్ ఫాజిల్. ముఖ్యంగా హీరో అంటే అందంగా ఉండాలి.. స్టైల్ గా ఉండాలి.. ఇంకా చాలా కొలమానాలు చెబుతారు. కానీ నటుడికి అవేవి అవసరం లేదు సరిగా నటించగలిగితే చాలు అని ప్రూవ్ చేశాడు ఫహాద్ ఫాజిల్.
అందుకే ఫహాద్ సినిమాలో ఉన్నాడు అంటే ఆ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందనే టాక్ తెచ్చుకున్నాడు. హీరోగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, సపోర్టింగ్ రోల్ ఇలా ఏదైనా సరే చేస్తూ తన మార్క్ చాటుతున్నాడు ఫహాద్ ఫాజిల్. కోవిడ్ లాక్ డౌన్ టైంలో కూడా అతను వరుస ఓటీటీ సినిమాలు చేశాడు. ఆ టైం లోనే తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు ఫహాద్ ఫాజిల్. ఫహాద్ ఫాజిల్ హీరోయిన్ నజ్రియాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 లో నటిస్తున్నారు ఫహాద్ ఫాజిల్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఫహాద్ ఫాజిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది తుపాకి.కామ్ టీం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆయన చేయాలని ఆశిద్దాం.