మూవీ రివ్యూ : ఫ్యామిలీ స్టార్

Update: 2024-04-05 07:46 GMT

'ఫ్యామిలీ స్టార్' మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్-జగపతిబాబు-రోహిణి హట్టంగడి-వాసుకి-అభినయ-రవిప్రకాష్-రాజా చెంబోలు-రవిబాబు-అజయ్ ఘోష్-అచ్యుత్ కుమార్-వెన్నెల కిషోర్ తదితరులు

సంగీతం: గోపీసుందర్

ఛాయాగ్రహణం: మోహనన్

నిర్మాతలు: రాజు-శిరీష్

రచన-దర్శకత్వం: పరశురామ్

'గీత గోవిందం'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ-పరశురామ్ మళ్లీ కలిసి చేసిన సినిమా.. ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు బేనర్లో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందా.. 'గీత గోవిందం'ను మ్యాజిక్ ను 'ఫ్యామిలీ స్టార్' రిపీట్ చేస్తుందా.. తెలుసుకుందాం పదండి.

కథ:

గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) కుటుంబం కోసం ప్రాణం పెట్టి పని చేసే కుర్రాడు. పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్న అతడి అన్నయ్యలిద్దరూ ఇంకా జీవితంలో సెటిల్ కాకపోవడంతో కుటుంబం బాధ్యత అంతా తనే తీసుకుని వాళ్ల కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటాడు. తనను ఇష్టపడ్డ అమ్మాయిని సైతం కుటుంబం కోసం దూరం పెడతాడు. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది. తన ఇంటి మేడ మీదే అద్దెకు దిగి తనతో పాటు తన కుటుంబానికి కూడా బాగా దగ్గరవుతుంది ఇందు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు గోవర్ధన్. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలోనే ఇందు గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటి.. దాని వల్ల గోవర్ధన్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. ఇంతకీ ఇందును గోవర్ధన్ పెళ్లి చేసుకున్నాడా లేదా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

పరశురామ్ చివరి సినిమా 'సర్కారు వారి పాట'లో కేవలం పది వేల డాలర్ల అప్పు వసూలు చేసుకోవడం కోసమని.. ఉన్న పనులన్నీ వదులుకుని అమెరికా నుంచి ఇండియాకు వచ్చేస్తాడు హీరో. మహేష్ బాబు లాంటి హీరోను పెట్టుకుని అలాంటి సిల్లీ కాన్ఫ్లిక్ట్ పాయింటుతో కథను నడిపించడం పరశురామ్ కే చెల్లింది. 'సర్కారు వారి పాట' మీద వచ్చిన విమర్శలు.. దాని ఫలితం చూశాకైనా అతను మారి ఉంటాడని.. ఈసారైనా కథలో సంఘర్షణకు దారి తీసే విషయాన్ని బలంగా చూపిస్తాడని అనుకుంటాం. కానీ 'ఫ్యామిలీ స్టార్' వ్యవహారం ఇంకా విడ్డూరం. ఒక మల్టీ నేషనల్ కంపెనీ సీఈవో అయిన అమ్మాయి.. మిడిల్ క్లాస్ మనుషుల మీద థీసిస్ రాయడానికి హీరో గారి ఇంటి మేడ మీద అద్దెకు దిగుతుందట. అతను చేసే ప్రతి పనికీ మురిసిపోయి.. తనకు పడిపోతుందట.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జనాలు ఏం తింటారు.. ఏం తొడుక్కుంటారు.. ఎలా ఆలోచిస్తారు.. ఎంత రాజీ పడతారు.. ఇలాంటి విషయాలన్నీ రాసి ఆమె థీసిస్ సబ్మిట్ చేస్తే ప్రొఫెసర్ ఆహా అద్భుతం అని పొగిడేస్తారట. హీరోయిన్ థీసిస్ కోసమే తనతో ప్రేమగా ఉందని తెలిసిన హీరో ఆమె మీద ప్రతికారం మొదలుపెడతాడట! ఇక్కడ చదువుతుంటే ఇదంతా ఎలా అనిపిస్తుందో కానీ.. తెర మీద చూస్తుంటే మాత్రం ఇలాంటి కథతో టాలీవుడ్లో 'జడ్జిమెంట్ కింగ్' అని పేరున్న దిల్ రాజు సహా ఇంతమందిని ఒప్పించి సినిమా తీయగలిగిన పరశరామ్ తెలివికి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది.

మధ్య తరగతి కుటుంబాలకు వెన్నెముకగా నిలుస్తూ వాటి ఉన్నతి కోసం పాటు పడే ప్రతి ఒక్కరూ స్టార్లే అని చెప్పాలన్నది దర్శకుడి ఉద్దేశం. నిజానికి ఇది మెజారిటీ ప్రేక్షకులు బాగా రిలేట్ అయ్యే పాయింట్. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి కథను సరిగ్గా నడిపిస్తే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఓన్ చేసుకోవడానికి అవకాశముండేది. కానీ కథను ఆరంభించడంలో ఉన్న పట్టు.. ఆ తర్వాత కొరవడింది. కథ మలుపు తిరగడానికి దారి తీసే పాయింటే పూర్తిగా తేడా కొట్టేసింది. మొదట్లో హీరో క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా సాగడం.. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగుండడంతో ఒక దశ వరకు 'ఫ్యామిలీ స్టార్' ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తుంది. కానీ హీరోయిన్ పాత్ర రంగప్రవేశంతోనే ఏదో తేడాగా అనిపిస్తుంది. హీరో ఇంట్లో అద్దెకు దిగిన అమ్మాయి.. పరిచయంలోనే 'ఏవండీ' అని సంబోధించడం.. 'నేను మీకు పడిపోయా' అనడం లాంటివి విడ్డూరంగా అనిపిస్తాయి. హీరో పట్ల ఆమెకు అసలు ఎందుకు ఆరాధన భావం కలుగుతుందో.. అతడి కోసం ఆమె ఎందుకు అంత తపిస్తుందో అర్థం కాదు. అయినా సరే.. సన్నివేశాలు సరదాగా సాగిపోతుండడంతో లాజిక్కులు వదిలేసి టైంపాస్ చేస్తాం. కానీ ఈ కథ మలుపు తిరిగే 'థీసిస్' వ్యవహారం దగ్గరే 'ఫ్యామిలీ స్టార్' గాడి తప్పేసింది. అక్కడ్నుంచి ప్రతి సీన్ వెటకారంగా అనిపిస్తాయి.

తన గురించి తన ఫ్యామిలీ గురించి థీసిస్ లో ఏదో రాసిందని.. హీరోయిన్ మీద హీరో రివెంజ్ తీర్చుకునే సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. ఒకట్రెండు సీన్లు అయితే ఓకే కానీ.. ద్వితీయార్ధం అంతా కూడా ఇదే దారిలో సాగిపోతుంది. కథ హైదరాబాద్ లో ఉన్నంత వరకు 'ఫ్యామిలీ స్టార్' ఎంగేజ్ చేస్తుంది కానీ.. అమెరికాకు మళ్లాక మాత్రం భరించలేని విధంగా తయారవుతుంది. హీరో చిత్ర విచిత్ర ప్రవర్తనతో తెర మీద కథానాయికకే కాదు.. చూసే ప్రేక్షకులకు కూడా తిక్క రేగుతుంది. హీరోకు డబ్బులు లేకుంటే న్యూయార్క్ టైం స్క్వేర్‌లో వ్యభిచారానికి రెడీ అయ్యే సీన్ అయితే ఒక 'మాస్టర్ పీస్' అని చెప్పాలి. ఇలాంటి సన్నివేశంతో వినోదం పండించాలని చూసిన దర్శకుడిని ఏమనాలి? ఎడిటింగ్ టేబుల్ ను దాటి ఈ సన్నివేశం ఫైనల్ కట్లోకి ఎలా వచ్చిందో మరి? 'ఫ్యామిలీ స్టార్' మళ్లీ గాడిన పడుతుందేమో అని ఆశించిన వాళ్లు కూడా.. ఈ సీన్ చూశాక ఆశలు వదులుకుంటారు. ఇక సినిమా ఆరంభం నుంచి ఫైట్ వచ్చిన ప్రతిసారీ ఏదో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలిగితే.. చివర్లో విలన్ ఎపిసోడ్ ఈ సినిమాలో అయితే మరీ కృత్రిమంగా అనిపిస్తుంది. అమెరికా ఎపిసోడ్ పుణ్యమా అని పూర్తిగా ఆసక్తి సన్నగిల్లిపోయిన 'ఫ్యామిలీ స్టార్'లో పతాక సన్నివేశాలు మరింత భారంగా తయారయ్యాయి. ఒక మంచి ఎంటర్టైనర్ తరహాలో మొదలై.. తర్వాత ఈ కథ టర్న్ తీసుకున్న విధానం చూస్తే.. చివరికి ముగిసిన తీరు చూస్తే పనిగట్టుకుని ఈ కథను చెడగొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. 'గీత గోవిందం' తర్వాత విజయ్-పరశురామ్ కలయికలో ఇలాంటి సినిమాను ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు.

నటీనటులు:

విజయ్ దేవరకొండ తన వరకు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. అతడి పాత్ర సగం వరకు చాలా బాగా అనిపిస్తుంది. కుటుంబ బాధ్యతల్ని నెత్తిన వేసుకుని కష్టపడే కుర్రాడి పాత్రకు విజయ్ బాగా సూటయ్యాడు. కొంత వరకు సినిమాను తన భుజాల మీద మోశాడు. కానీ కథ బరువు తగ్గే కొద్దీ అతను కూడా బలహీన పడిపోయాడు. పూర్తిగా గాడి తప్పిన సినిమాను అతను కూడా రక్షించలేకపోయాడు. ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ లుక్ బాగుంది. మృణాల్ ఠాకూర్ పాత్ర.. తన పెర్ఫామెన్స్ మిశ్రమానుభూతిని కలిగిస్తాయి. ప్రథమార్ధంలో చలాకీగా.. అందంగా కనిపించే ఆమె.. సగం నుంచి కథ ప్రకారం మూడీగా తయారవడంతో తన పాత్రను అంతగా ఎంజాయ్ చేయలేం. కొన్ని చోట్ల ఆమె లుక్ కూడా తేడా కొట్టింది. రిచ్ డాడ్ పాత్రలతో విసుగెత్తిపోయానని జగపతిబాబు ఎంత మొత్తుకుంటున్నా ఆయనకు మళ్లీ అవే పాత్రలు ఇస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్'లో ఆయన వల్ల సినిమాకు కానీ.. సినిమా వల్ల ఆయనకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. హీరో వదినలుగా వాసుకి-అభినయ.. అన్నలుగా రవిప్రకాష్-రాజా చెంబ్రోలు ఓకే. రోహిణి హట్టంగడి బామ్మ పాత్రలో ఒదిగిపోయింది. అచ్యుత్ కుమార్ చేసిన విలన్ పాత్ర గురించి చెప్పడానికి ఏమీ లేదు. వెన్నెల కిషోర్ చిన్న నవ్వు కూడా నవ్వించని సినిమాల్లో 'ఫ్యామిలీ స్టార్' ఒకటి. అతను సినిమాలో ఉన్నాడంటే ఉన్నాడనిపించాడు.

సాంకేతిక వర్గం:

గోపీసుందర్ పాటల వరకు ఓకే అనిపించాడు. పాటలు కొత్తగా అనిపించవు కానీ.. వినసొంపుగానే ఉన్నాయి. కానీ సినిమాలో పాటల ప్లేస్మెంట్ మాత్రం పేలవంగా ఉంది. అస్సలు సింక్ కాని టైంలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చేయలేం. కలర్ ఫుల్ సాంగ్ అయిన 'కళ్యాణి'ని రోలింగ్ టైటిల్స్ టైంలో వేశారు. పాటల వరకు ఓకే అనిపించిన గోపీసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో తీవ్రంగా నిరాశ పరిచాడు. యాక్షన్ సీక్వెన్సుల్లో చిత్ర విచిత్రమైన సౌండ్లతో విసుగు పుట్టించాడు. రవిబాబు ఆఫీసులో హీరో చేసే ఫైట్లో వచ్చే స్కోర్ అయితే భరించలేని విధంగా అనిపిస్తుంది. సినిమా అంతా సన్నివేశాలతో సంబంధం లేకుండా ఆర్ఆర్ నాన్ సింక్ లో సాగినట్లు అనిపిస్తుంది. మోహనన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఓకే. పరశురామ్ రైటింగ్ దగ్గరే తేలిపోయాడు. దర్శకుడిగా కూడా అతను మెప్పించలేకపోయాడు. ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో 'ఫ్యామిలీ స్టార్' దిగువన నిలుస్తుంది. కథ విషయంలో అతను ఏమాత్రం సీరియస్నెస్ చూపించలేకపోయాడు. కథకు కీలకమైన సన్నివేశాలు లాజిక్కులు లేకుండా సిల్లీగా నడిపించడంతో 'ఫ్యామిలీ స్టార్'ను ప్రేక్షకులు సీరియస్ గా తీసుకునే అవకాశం లేకపోయింది.

చివరగా: ఫ్యామిలీ స్టార్.. మధ్యలో మిస్ ఫైర్

రేటింగ్-  2.25/5

Tags:    

Similar News