ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
ఆయన తో సాన్నిహిత్యం ఉన్న వారంతా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) కన్నుమూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి బాపట్ల దగ్గర్లోని కారంచేడులోని ఆయన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలుగు చనల చిత్ర నిర్మాతల మండలి సంతాపం ప్రకటించింది. ఆయన తో సాన్నిహిత్యం ఉన్న వారంతా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
కృష్ణమూర్తి ఇండస్ట్రీకి నటుడవ్వాలని వచ్చారు. తొలుత చిన్న చిన్న చిత్రాల్లో నటుడిగా పనిచేసారు. వివిధ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. 'వియ్యాల వారి కయ్యాలు',' ప్రతిబింబాలు', 'ఒక దీపం వెలిగింది', 'శ్రీవినాయక విజయం',' కోడళ్లొస్తున్నారు జాగ్రత్త' వంటి చిత్రాలు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.
రాధా కృష్ణ మూర్తి మూడు రోజుల క్రితం అస్వస్థతకి గురవ్వడంతో వయోభారం వల్లనే కన్నుమూసినట్లు తెలుస్తుంది. అంత్యక్రియలు ఆదివారమే పూర్తయ్యాయి. ఆయనకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండగా సతీమణి ఏడాది క్రితమే పరమపదించారు. దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తో చేసిన 'ప్రతిబింబాలు' మూవీ 1982 లో విడుదల కావలసి ఉన్న కొన్ని కారణాల రీత్యా విడుదల కాలేదు.
దీంతో ఆ సినిమా రిలీజ్ ఆగిపోయినట్లేనని అంతా ఓ నిర్ణయానికి వచ్చేసారు. కానీ రాధాకృష్ణ మాత్రం రిలీజ్ వరకూ నిద్రపోలేదు. రిలీజ్ కి ఎంతో పట్టుబట్టారు. చివరికి అదే పట్టుదలతో సుమారు నలభై ఏళ్ల తర్వాత అక్కినేని జయంతి సందర్భంగా రిలీజ్ చేసి తన పంతం నెగ్గించుకున్నారు. 2022 లో ఆ సినిమా రిలీజ్ అయింది.