'రూ.1200 అయితే ఎట్లా సర్'.. పుష్ప-2 నిర్మాతలకు క్వశ్చన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప-2 మూవీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప-2 మూవీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా 12 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసిన మేకర్స్.. ఐదేళ్ల తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో వరల్డ్ వైడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప సీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో పుష్ప-2 టికెట్ ధరలు కాస్త తక్కువ అనే చెప్పాలి.
అయితే తెలంగాణలో ప్రీమియర్ షో టికెట్ ధరపై రూ.800 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో టికెట్ ధరలుగా భారీగా ఉన్నాయి. కొన్ని థియేటర్స్ లో రూ.1200 వరకు కూడా ధర ఉంది. దీంతో సాధారణ ప్రేక్షకులు రేట్ల పట్ల ఆందోళన చెందుతున్నారు. అంత ఎక్కువ అయితే సినిమా చూసేదెలా అని వాపోతున్నారు.
ఇదే విషయంపై నిన్న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓ అభిమాని పుష్ప-2 నిర్మాతలను ప్రశ్నించారు. వేడుకలో భాగంగా.. నవీన్ యెర్నేని వేదికపై మాట్లాడారు. ఫైనల్లీ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన థియేటర్స్ లోకి వస్తుండడంతో చాలా హ్యాపీగా ఉందని నవీన్ తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఆ తర్వాత డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30.. థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసి ఆదరిస్తారని నమ్ముతున్నామని తెలిపారు. ఆ సమయంలో మరీ 1200 రూపాయలు అయితే ఎట్లా సార్ అని అడిగాడు. దీంతో నిర్మాతలు నవీన్, రవిశంకర్ నవ్వారు. దీనిపై స్పందించేందుకు రవిశంకర్.. నవీన్ కు మైక్ ను ఇచ్చారు. కానీ ఏం మాట్లాడలేదు..
అందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతడు అడిగింది నిజమేనని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు కాబట్టి అంత రేట్లని చెబుతున్నారు. మరి పుష్ప-2 ప్రీమియర్ షోకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.