విశ్వంభర.. పెద్ద కష్టమే వచ్చింది!
ముఖ్యంగా టీజర్ లో అనేక హాలీవుడ్ మూవీస్ రిఫరెన్సులు ఉన్నాయని చెబుతున్నారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఆ మూవీని రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. బింబిసార విషయంలో తక్కువ బడ్జెట్ తోనే వశిష్ట మంచి అవుట్ పుట్ ఇవ్వడంతో.. విశ్వంభరపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే మేకర్స్.. దసరా కానుకగా విశ్వంభర టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఫాంటసీ వండర్ గా ఇటీవల విడుదలవ్వగా.. అనేకమంది సినీ ప్రియులు నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. వీఎఫ్ ఎక్స్ అస్సలు బాగోలేదని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా టీజర్ లో అనేక హాలీవుడ్ మూవీస్ రిఫరెన్సులు ఉన్నాయని చెబుతున్నారు. వాటిని సెకండ్స్ తో పాటు మెన్షన్ చేసి మరీ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.
పోనీ అలా రిఫరెన్సులు తీసుకున్నా.. క్వాలిటీ అసలు లేదని చెబుతున్నారు. చిన్న టీజర్ లోనే ఇన్ని హాలీవుడ్ సినిమాల రిఫరెన్సులు, కాపీ ట్యూన్లు ఉన్నాయా అని కామెంట్లు పెడుతున్నారు. గ్లింప్స్ స్టార్టింగ్ లో డ్యూన్ సినిమా ట్యూన్ ఉందని, ఆ తర్వాత అవెంజర్స్ ఇన్‌ఫినిటీ వార్ షాట్ ను మేకర్స్ వాడారని చెబుతున్నారు. అవతార్ డ్రాగన్ రిఫరెన్స్ ఉందని కూడా అంటున్నారు. జురాసిక్ వరల్డ్ డైనోసార్స్, థార్ కారెక్టర్ పార్ట్ అయి ఆస్ గార్డ్ భిఫ్రోస్ట్ షాట్ ఉందని అంటున్నారు.
అలా సెకెండ్ టూ సెకండ్.. టీజర్ లో ఎన్ని రిఫరెన్సులు ఉన్నాయో పోస్ట్ చేస్తున్నారు. రిఫరెన్సులు వాడటం కామన్ అని.. ఒకటో రెండో దగ్గర అయితే పర్లేదని చెబుతున్నారు. కానీ టీజర్ అంతా రిఫరెన్సులతో నిండిపోయిందని అంటున్నారు. రెక్కల గుర్రం కాన్సెప్ట్ కూడా బాలకృష్ణ భైరవ ద్వీపం మూవీలో వాడిన దేనని చెబుతున్నారు. టీజర్ లో కనిపిస్తున్న చిన్న పాప లుక్స్ లో అవతార్ షేడ్స్ ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. బింబిసారలోలాగా ఆ పాపే సినిమాకు కీలకంగా అనిపిస్తుందని అంటున్నారు.
ఇప్పుడు టీజర్ లోనే అన్ని రిఫరెన్సులు ఉంటే.. సినిమా మొత్తం రిఫరెన్సులతో కానిచ్చేసారేమోనని పలువురు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా ఆడియన్స్ లో టీజర్ తో అంచనాలు తగ్గాయనే చెప్పాలి. ఇది మేకర్స్ కు పెద్ద తలనొప్పే! దీంతో నెక్స్ట్ అప్డేట్ కచ్చితంగా వేరే లెవెల్ లో ఉండాలి. అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేయాలి. అందుకోసం చాలా కష్టపడాలి. మరి విశ్వంభర మేకర్స్.. ఏం చేస్తారో? టీజర్ తో వచ్చిన నెగిటివిటీ ఎలా తగ్గిస్తారో? వేచి చూడాలి.