అగ్ర హీరోని చంపేస్తానని బెదిరించిన న‌టి

90లలో ఆమె ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టీమ‌ణుల్లో ఒక‌రు. పాపుల‌ర్ గాయ‌కుడి కుమారుడి డెబ్యూ సినిమాతో తెరంగేట్రం చేసింది

Update: 2024-12-24 03:15 GMT

90లలో ఆమె ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టీమ‌ణుల్లో ఒక‌రు. పాపుల‌ర్ గాయ‌కుడి కుమారుడి డెబ్యూ సినిమాతో తెరంగేట్రం చేసింది. కానీ తొలి ప్ర‌య‌త్నం ప‌రాజ‌యం పాలైంది. అయినా త‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఆ త‌ర్వాత డ‌జ‌ను హిట్ చిత్రాల్లో న‌టించి మెప్పించింది. ప్ర‌తి హీరో త‌న‌తో క‌లిసి ఒక్క సినిమా అయినా చేయాల‌ని కోరుకునేంత ఫేమ్ సంపాదించింది. కానీ ఏం లాభం. త‌న‌కు కోపం ఎక్కువ‌. అది కెరీర్ లో గొప్ప అవ‌కాశాలు రాకుండా నాశ‌నం చేసింది.

ఆమె త‌న‌ కోపం కార‌ణంగా ఒక న‌టుడిని చెంప చిత‌క్కొట్టింది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోని చిత‌క్కొడ‌తాన‌ని బెదిరించింది. ఇలాంటి కార‌ణాల‌తో కెరీర్ లో ఎన్నో అవ‌కాశాల‌ను కోల్పోయింది. హీరోల్ని త‌న్నులు తింటావ్! అంటూ చాటునా మాటునా అన‌లేదు ఈ బ్యూటీ. ప‌బ్లిగ్గా మీడియా ముందే హెచ్చ‌రించి నాటి వార్త‌ల్లో సంచ‌ల‌న క‌థానాయిక‌గా మారింది. ఇదంతా ఎవ‌రి గురించి? అంటే.. ప్ర‌ముఖ క‌థానాయిక ట‌బు సిస్ట‌ర్ ఫ‌రా నాజ్ గురించిన స్టోరి ఇది. టబును మించిన అంద‌గ‌త్తె అయినా త‌న కెరీర్ ఎందుకు ముగిసింది? అన్న‌దానికి ఇది స‌మాధానం.

90ల‌లో ప్రముఖ బాలీవుడ్ నటీమణులలో ఫరా నాజ్ ఒకరు. గాయకుడు మహేంద్ర కపూర్ కుమారుడు రోహన్ కపూర్ సరసన యష్ చోప్రా `ఫాస్లే`తో తెరంంగేట్రం చేసింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఫరా నటనకు మాత్రం గొప్ప‌ ప్రశంసలు లభించాయి. మర్తే దామ్ తక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, రఖ్‌వాలా, ఇమాందార్, ఘర్ ఘర్ కి కహానీ, దిల్జాలా, బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రి వంటి హిట్ చిత్రాలలో నటించింది. ఆ రోజుల్లో ప్ర‌తి న‌టుడూ త‌న‌తో క‌లిసి న‌టించాల‌ని త‌పించేవారు. నిజానికి మాధురీ దీక్షిత్, కరిష్మా కపూర్ కంటే బాగా పాపులర్ న‌టి. రాజేష్ ఖన్నా, రిషి కపూర్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్, గోవిందా, వినోద్ ఖన్నా, సన్నీ డియోల్ వంటి సూపర్ స్టార్‌ల స‌ర‌స‌న న‌టించింది.

అయితే కాల‌ప‌రీక్ష‌లో ఫ‌రా నెగ్గ‌లేక‌పోయింది. వివాదాలు త‌న‌ను చుట్టుముట్టాయి. `కసమ్ వర్ది కి` షూటింగ్ సమయంలో న‌టుడు చుంకీ పాండే ఫరాపై ఒక జోక్ పేల్చాడు. దానిని ఆమె తేలికగా తీసుకోలేదు. దూకుడుగా చంకీని చెంపదెబ్బ కొట్టిన సంఘటన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దానికి తోడు ఫరా ఒక పత్రిక ఇంటర్వ్యూలో చంకీని చంపేస్తానని బెదిరించడంతో పరిస్థితి అదుపుత‌ప్పింది. సినీప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపిన ఘ‌ట‌న లు ఇంకా ఉన్నాయి. ఒక సినిమాలో తన స్థానంలో మాధురీ దీక్షిత్‌ని తీసుకోవాలని కోరినప్పుడు ఫరా ఒకసారి స్టార్ హీరో అనీల్ కపూర్‌ని బెదిరించింది. దాని కార‌ణంగా ఫరా ఆ అవ‌కాశాన్ని కోల్పోయింది. ఆ త‌ర్వాత ఫ‌రా అనిల్ కపూర్‌ను బహిరంగంగా తిట్టింది.. అతన్ని కొడతానని కూడా బెదిరించింది. ఆమె మాధురీ దీక్షిత్‌ను కూడా విడిచిపెట్టలేదు.. త‌న‌ను కూడా హెచ్చ‌రించింది. దీని కారణంగా ఫ‌రా స్వయంగా ఆ చిత్రం నుండి తప్పుకుంది.

ఫరా నాజ్ ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? అంటే... న‌టుడిగా మారిన మ‌ల్ల యోధుడు ధారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్ ని పెళ్లాడింది. కానీ 2002లో అత‌డితో విడాకులు అయింది. ఆ త‌ర్వాత న‌టుడు కం నిర్మాత‌ సుమీత్ సైగల్ ని పెళ్లాడారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ప్ర‌స్తుతం ఫ‌రా సంతోష‌క‌ర‌మైన కుటుంబ జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఆమె సోదరి టబు తన అద్భుతమైన నటనతో బాలీవుడ్‌ను శాసిస్తున్నా కానీ, ఫరా ఇప్పుడు గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ట‌బు కంటే అంద‌గ‌త్తె .. ప్ర‌తిభావ‌ని.. కానీ ముక్కోపం కార‌ణంగా కెరీర్ ని కోల్పోయిన న‌టిగా ఫ‌రా పేరు చ‌రిత్ర‌కెక్కింది.

Tags:    

Similar News