ఫిలింఫేర్- 2024 ఉత్తమ దర్శకుడు సందీప్ వంగా?
అంటే అవుననే తెలుగు ప్రజలు బలంగా నమ్ముతున్నారు.. కచ్ఛితంగా అతడు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ కి అర్హుడు అని అభిమానులు బలంగా చెబుతున్నారు.
2024 ఫిలింఫేర్ ఉత్సవాల్లో తెలుగు దర్శకుడు సందీప్ వంగాకు అరుదైన గౌరవం దక్కనుందా? అంటే అవుననే తెలుగు ప్రజలు బలంగా నమ్ముతున్నారు.. కచ్ఛితంగా అతడు ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ కి అర్హుడు అని అభిమానులు బలంగా చెబుతున్నారు. 'యానిమల్' రూపంలో బాలీవుడ్ కి అతడు ఇచ్చిన ట్రీట్ నిజానికి మామూలుగా లేదు. 2023లో బెస్ట్ హిట్ చిత్రాల జాబితాలో అగ్రతాంబూలం అందుకుంది. కల్ట్ క్లాసిక్ జానర్ లో మాస్ యాక్షన్ అంశాలు ఘాటైన రొమాన్స్ తో అతడు వైవిధ్యం ఉన్న సినిమాని అందించడంలో ఘనవిజయం సాధించాడు. నటన, యాక్షన్, రొమాన్స్, డైలాగ్స్, సంగీతం .. ఇలా అన్ని విభాగాల్లో నిపుణులతో గొప్ప పనితనం రాబట్టుకున్న మేటి ప్రతిభావంతుడిగా సందీప్ వంగాను ప్రపంచం గుర్తించింది.
ఫార్ములాను బ్రేక్ చేసి సినిమా తీయడంలో సందీప్ తనకు తానే సాటి... ఎంపిక చేసుకున్న కథాంశం, థీమ్ లైన్ తో ఆసక్తిని కలిగించే సందీప్ వంగా, తన పాత్రల్ని పాత్రధారుల్ని ఎలివేట్ చేసే తీరు విభిన్నమైనది. డైలాగ్స్ పరంగాను ఘాడత యూనిక్ నెస్ తెరపై మెరుపులే. ఇక అతడు సంగీతం రాబట్టుకునే విధానం కూడా చాలా ప్రత్యేకమైనది అని యానిమల్ నిరూపించింది. ఇందులో ఓ రెండు పాటలతో మెరుపులు మెరిపించాడు.
యానిమల్ బాక్సాఫీస్ వద్ద రూ.910 కోట్లు వసూలు చేసింది. పైగా ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నుంచి సందీప్ వంగా నటన రాబట్టుకున్న వైనం అద్భుతం అన్న ప్రశంసలు దక్కాయి. రణబీర్ కి తన పాన్ ఇండియా కలను నెరవేర్చేందుకు సహకరించిన ఏకైక దర్శకుడు సందీప్ వంగా. ఇక ఇదే చిత్రంలో కథానాయికగా నటించిన రష్మిక మందన్నకు, అబ్రార్ పాత్రలో నటించిన బాబిడియోల్ కి, సహాయక పాత్రలో నటించిన ట్రిప్తి దిమ్రీకి గొప్ప పేరొచ్చింది అంటే అందుకు కారకుడు సందీప్ వంగా సెలెక్షన్... పాత్రలను మలిచిన తీరు అనడంలో సందేహం లేదు. సందీప్ సాంకేతిక నిపుణులతో పనిని రాబట్టుకున్న విధానం కూడా ఎంతో గొప్పది.
ఉత్తమ దర్శకుడు కేటగిరీలో 2024 ఫిలింఫేర్ కి నామినేషన్లను పరిశీలిస్తే.... సందీప్ రెడ్డి వంగా- యానిమల్, విధు వినోద్ చోప్రా -12 ఫెయిల్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. అమిత్ రాయ్ (Omg 2), అట్లీ (జవాన్), కరణ్ జోహార్ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ), సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్) కూడా పోటీబరిలో ఉన్నారు. అయితే పై దర్శకుల్లో అట్లీ రొటీన్ సినిమా తీశాడని విమర్శల్ని ఎదుర్కొనగా, కరణ్ కూడా తన జానర్ నే తిప్పి తీసాడని విమర్శలొచ్చాయి. అలాగే సిద్ధార్థ్ ఆనంద్ రొటీన్ యాక్షన్ మసాలా కంటెంట్ ని అందించాడని విమర్శకులు సమీక్షల్లో రాసారు. కానీ సందీప్ వంగా విషయంలో అలాంటి చచ్చుబడిన కామెంట్లు ఏవీ వినిపించలేదు. అతడి సినిమాలో హింస, రక్తపాతం, స్త్రీ ద్వేషం ఉన్నాయంటూ ఒక సెక్షన్ హీరోల అభిమానులు సోషల్ మీడియాల్లో కావాలని ప్రచారం సాగించారని కూడా టాక్ ఉంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ కి మతి చెడే ట్రీటిచ్చిన తెలుగు వాడైన సందీప్ రెడ్డి వంగాను ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడిగా ప్రకటించాలని కూడా తెలుగు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
-శివాజీ.కె