కంగువ.. వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లేనా?
దీనికి మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్, ఆసియన్ డిస్ట్రిబ్యూషన్ మధ్య వివాదమే కారణమని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ 'కంగువ' మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి బజ్ ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ కీలకమైన హైదరాబాద్ లో ఇప్పటి దాకా పూర్తి స్థాయిలో బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోవడం అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తోంది. దీనికి మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్, ఆసియన్ డిస్ట్రిబ్యూషన్ మధ్య వివాదమే కారణమని తెలుస్తోంది.
'కంగువ' చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. ఏపీలో యువీ నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేస్తుండగా.. నైజాం థియేట్రికల్ హక్కులను మాత్రం మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ సొంతం చేసుకున్నారు. అయితే ఏషియన్ మూవీస్ తో మైత్రీ వివాదం కారణంగా హైదరాబాద్ లో థియేటర్ల సమస్య తలెత్తింది. అందుకే సిటీలోని ఏఎంబీ సినిమాస్, ఏఏఏ, పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ మూవీస్ వంటి మల్టీప్లెక్స్ లలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.
మాములుగా థియేటర్ షేరింగ్, రెంటల్ విధానంలో సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. షేరింగ్ విధానంలో సినిమాకి వచ్చిన కలెక్షన్స్ లో ఎగ్జిబిటర్స్, డిస్టిబ్యూటర్స్ కి పర్సెంటేజ్ షేర్ చేసుకుంటారు. రెంటల్ లో అయితే సినిమా ఎన్ని రోజులు థియేటర్లలో ప్రదర్శిస్తే అన్ని రోజులకి రెంట్ ఇస్తారు. ఇప్పుడు మైత్రీ మూవీస్ వారు 'కంగువ' చిత్రాన్ని రెంటల్ విధానంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. కానీ ఏషియన్ సినిమాస్ ఈ విధానాన్ని వ్యతిరేకించడం.. మైత్రీ సంస్థ వెనక్కి తగ్గకపోవడం వల్లనే వివాదం మొదలైందని అంటున్నారు. ఆధిపత్య పోరు కూడా దీనికి ఓ కారణమనే మాట కూడా వినిపిస్తోంది.
అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ - ఆసియన్ డిస్ట్రిబ్యూషన్ మధ్య వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకున్నారని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లోని అన్ని మల్టీప్లెక్స్ లలో 'కంగువ' బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికైతే హైదరాబాద్ లో కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే బుకింగ్స్ తెరుచుకున్నాయి. ఇంకా మల్టీప్లెక్స్ లలో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు.
పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ మూవీస్ తమ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో 'కంగువ' సినిమా గురించి పోస్టులు పెడుతున్నాయి కానీ.. బుక్ మై షో, పేటీఎం వంటి యాప్స్ లో బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయడం లేదు. దీంతో వివాదం చిక్కుముడి ఇంకా వీడలేదేమో అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఎలాంటి గొడవలు లేకుండా సూర్య సినిమాకి నైజాంలో మంచి రిలీజ్ దొరకాలని, మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.