'హనుమాన్' దర్శకుడికి ఎదురుదెబ్బ తగిలినట్లేనా?
అయితే ఈ యంగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ కు మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది.
'అ!' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రశాంత్ వర్మ.. డెబ్యూతోనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుంచీ వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో విభిన్నమైన కథలను తెర మీదకు తీసుకొస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. హను-మాన్ మూవీతో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మరిన్ని ఆసక్తికరమైన కథలు చెప్పడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ యంగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ కు మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది.
ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా సినిమాలు తీస్తూనే, వేరే దర్శకులకు కథలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్టోరీతో తీసిన లేటెస్ట్ మూవీ ''దేవకీ నందన వాసుదేవ''. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించాడు. ఫెమినా మిస్ ఇండియా విన్నర్ మానస వారణాసి హీరోయిన్ గా నటించింది. 'గుణ 369' ఫేమ్ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. అయితే మంచి అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి బలహీనమైన టాక్ వచ్చింది.
'హను-మాన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రశాంత్ వర్మ పేరు మీదుగా వస్తున్న సినిమా కావడం.. "దేవకీ నందన వాసుదేవ" అనే మంచి టైటిల్ పెట్టడంతో ముందు నుంచే జనాల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మహేశ్ బాబు సైతం కాస్త సమయం కేటాయించి మేనల్లుడి సినిమాకి సపోర్టు అందించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద జీరో షేర్ సాధించింది.
భాగవతం రెఫరెన్స్ తీసుకుని కృష్ణుడు, కంసుడు, సత్యభామ పాత్రల స్ఫూర్తితో రాసుకున్న కథతో 'దేవకీ నందన వాసుదేవ' సినిమా రూపొందింది. అయితే ఈ కాన్సెప్ట్ ని నేటి తరం ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోయారు. నేరేషన్ మరీ ఓల్డ్ స్టయిల్లో ఉండటం, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం ప్రధాన మైనస్ గా మారింది. అశోక్ గల్లా రేంజ్ కు మించి ఎలివేషన్లు, యాక్షన్ సీన్స్ పెట్టారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. దీనికి దర్శకత్వం వహించింది ప్రశాంత్ వర్మ కాకపోయినా, కథ అందించాడు కాబట్టి ఈ సినిమా రిజల్ట్ లో అతనికి కూడా భాగం ఉంటుంది.
'దేవకీ నందన వాసుదేవ' సినిమాని ప్రశాంత్ వర్మ చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. ఇంటర్వ్యూలలో పాల్గొని మూవీపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సినిమాలో అంత మ్యాటర్ లేదనే మాట వినిపిస్తోంది. ప్రశాంత్ రాసిన కథలో కొన్ని మార్పులు చేసినప్పటికీ, జనాలు దీన్ని 'హనుమాన్' దర్శకుడి కథలాగే చూస్తారు. కాబట్టి ఈ మూవీ హిట్టయినా ఫ్లాప్ అయినా క్రెడిట్ అతనికే ఇస్తారు. ఇప్పటికైతే గల్లా అశోక్ సినిమాకి ఆక్యుపెన్సీ యావరేజ్ గా ఉంది. వీకెండ్ లోనే ఇలా ఉంటే, వారాంతంలో దీని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.
ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా పరిచయం అవ్వకముందే 33 కథలు రాసుకున్నట్లుగా తెలిపారు. ఒక కథతో గతంలో తేజ సజ్జ 'అద్భుతం' అనే సినిమా తీశాడు. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబడిన ఈ చిత్రం ఓటీటీ జనాలను ఆకట్టుకుంది. ఇప్పుడు ఇంకో కథతో 'దేవకీ నందన వాసుదేవ' సినిమా తెరకెక్కించారు కానీ, ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది. దీంతో ప్రశాంత్ దగ్గర మిగిలి ఉన్న స్టోరీలు ఎలా ఉంటాయో?, అప్పుడెప్పుడో రాసుకున్న కథలు ఇప్పటి ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.