చరణ్ స్నేహంపై మంచు మనోజ్ వ్యాఖ్య
అంతేకాదు.. చరణ్ కి తాను అభిమానిని అని నిన్నటిరోజున జరిగిన రామ్ చరణ్ బర్త్ డే (27 మార్చి) ఈవెంట్లో మనోజ్ వ్యాఖ్యానించాడు.
మెగా పవర్‌స్టార్‌గా ఎదగక ముందు నుంచే రామ్‌చరణ్‌కి పరిశ్రమలో మంచి స్నేహితులు ఉన్నారు. అందులో శర్వానంద్ అత్యంత సన్నిహిత మిత్రుడు. శర్వా ప్రతిసారీ చరణ్ తో స్నేహం గురించి ప్రస్థావిస్తూనే ఉంటాడు. స్నేహితుడిగా చరణ్ లోని క్వాలిటీస్ గురించి వేదికలపైనే ప్రస్థావిస్తుంటాడు. దగ్గుబాటి రానా కూడా అత్యంత సన్నిహితుడు. బావా బావా అనుకునేంత స్నేహం వీళ్లది. అక్కినేని అఖిల్ అయితే అన్నయ్యా అని కూడా పిలుస్తాడు చరణ్‌ని.
ఇలా పరిశ్రమలో చాలామంది స్నేహితులు, సన్నిహితులు చరణ్ ని అభిమానించే వారు ఉన్నారు అంటే దానికి కారణం అతడి ఒదిగి ఉండే తత్వం, సాయం చేసే గుణం అని చాలామంది చెబుతుంటారు. ఇప్పుడు అదే మాట అన్నాడు మంచు మనోజ్ కూడా. చరణ్ తనకు చిన్నప్పటి నుంచి ఎంతో మంచి స్నేహితుడు అని మనోజ్ అన్నారు.
అంతేకాదు.. చరణ్ కి తాను అభిమానిని అని నిన్నటిరోజున జరిగిన రామ్ చరణ్ బర్త్ డే (27 మార్చి) ఈవెంట్లో మనోజ్ వ్యాఖ్యానించాడు. చరణ్ ఫ్యాన్స్ స్పెషల్ మీట్ లో మంచు హీరో వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
చెన్నైలో పక్క పక్క ఇంట్లోనే ఉండేవాళ్లమని మనోజ్ తెలిపారు. అప్పటి నుంచి చరణ్ తో సాన్నిహిత్యం ఉందని అన్నారు. అయితే ఒకానొక సందర్భంలో దుబాయ్ లో ఒక ఆడబిడ్డకు వచ్చిన కష్టం గురించి చరణ్ కి చెబితే వెంటనే రూ.5లక్షలు ఆర్థిక సాయం చేసాడని, చరణ్ మంచి మనసుకు అది నిదర్శనమని మనోజ్ అన్నాడు. దుబాయ్ లో ఒక కుటుంబం కష్టంలో పడింది. ఆడబిడ్డకు సాయం అవసరమైంది. వెంటనే తనకు తోచిన సాయం చేసానని, ఆ సమయంలో డబ్బు చాలక చరణ్ ని కూడా అడిగానని మనోజ్ అన్నారు. అర్థరాత్రి ఫోన్ చేసి అడిగితే చరణ్ కాదనలేదని కూడా వ్యాఖ్యానించాడు.
స్టార్ డమ్ వచ్చాక ఇంత పెద్ద స్థాయికి ఎదిగాక పాత స్నేహితులను మర్చిపోయి కొత్త స్నేహాల్ని వెతుకుతారని, కానీ చరణ్ మాత్రం ఇప్పటికీ మారకుండా అలానే ఉన్నాడని కూడా మనోజ్ అన్నారు. చరణ్ చిన్నప్పటి నుంచి తనతో ఉన్న స్నేహితులతో ఎప్పటిలానే ఉన్నాడని మనోజ్ వ్యాఖ్యానించారు. మనోజ్ ఇటీవల కెరీర్ ని ట్రాక్ లో పెట్టేందుకు శ్రమిస్తున్నాడు. సొంత బ్యానర్ సినిమా కొంత ఆలస్యమైంది. వాట్ ద ఫిష్ అనే చిత్రంలోను నటిస్తున్న సంగతి తెలిసిందే.