'గేమ్ ఛేంజర్'.. అలా చేస్తే రిజల్ట్ మరోలా ఉండేదా?

ఎక్క‌డా శంక‌ర్ మార్క్ లేకుండా తీసిన ఫ‌క్తు క‌మర్షియ‌ల్ సినిమా ఇదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే చరణ్ వరకూ న్యాయం చేసాడని అంటున్నారు.

Update: 2025-01-13 09:24 GMT

రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''గేమ్‌ ఛేంజర్‌''. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. అయితే తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక శంకర్ మేకింగ్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఎక్క‌డా శంక‌ర్ మార్క్ లేకుండా తీసిన ఫ‌క్తు క‌మర్షియ‌ల్ సినిమా ఇదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే చరణ్ వరకూ న్యాయం చేసాడని అంటున్నారు.

'గేమ్‌ ఛేంజర్‌' సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేసారు. కాలేజీ స్టూడెంట్, పోలీస్ ఆఫీసర్, కలెక్టర్, ఎలక్షన్ ఆఫీసర్, ఫార్మర్, పొలిటీషియన్.. ఇలా వివిధ కోణాల్లో సాగే పాత్ర‌లో కనిపించారు. యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా, ప‌బ్లిక్ స‌ర్వెంట్‌గా మంచి న‌ట‌న‌ కనబరిచారు చెర్రీ. ముఖ్యంగా అప్ప‌న్న పాత్రలో ఆయన న‌ట‌న ఆడియన్స్ ను ఆక‌ట్టుకుంటోంది. కాస్త నత్తితో మాట్లాడుతూ, ఆ పాత్రలోని అమాయకత్వం, భావోద్వేగాలని చరణ్ అద్భుతంగా పండించారని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

గతంలో 'రంగస్థలం' చిత్రంలో చిట్టిబాబుగా తన యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేసాడు రామ్ చరణ్. ఇప్పుడు 'గేమ్‌ ఛేంజర్‌' మూవీలో అప్పన్న పాత్రలో అంతే గొప్పగా నటించారని అభిమానులు భావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో చిట్టిబాబు, అప్పన్న పాత్రల మధ్య ఓటింగ్ కూడా పెడుతున్నారు. సినిమాలో మెజారిటీ భాగాన్ని అప్పన్న క్యారక్టర్ తో నడిపించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన పాత్రకు ఇంకా ఎక్కువ సన్నివేశాలు పెడితే ఫలితం వేరేలా ఉండేదని అంటున్నారు. అసలు అప్పన్నతోనే సోలో సినిమాగా చేసుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని చాలా మంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ కి, అవినీతిపరుడైన రాజ‌కీయ నాయ‌కుడికీ మ‌ధ్య సాగే యుద్ధంగా 'గేమ్‌ ఛేంజర్‌' తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి స్టోరీ లైన్ అందించగా.. శంకర్ తన శైలిలోకి మార్చి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దీని కోసం రామ్ చరణ్ మూడున్నరేళ్ల విలువైన సమయాన్ని వెచ్చించారు. నిర్మాత దిల్ రాజు రూ. 400 - 500 కోట్ల వరకూ ఖర్చు చేసారు. కేవలం నాలుగైదు పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఆడియన్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అక్క‌డ‌క్కడా శంకర్‌ మార్క్ భారీ విజువ‌ల్స్, అప్ప‌న్న ఎపిసోడ్, కొన్ని మెరుపులు మిన‌హా.. స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ ప‌రంగా మ‌న‌సుల్ని తాకలేదు. స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉండటం కూడా మైనస్ అయింది.

రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. అప్పన్న పాత్రకి జోడీగా పార్వ‌తి అనే న‌ట‌న‌కి ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో అంజ‌లి అలరించింది. విలన్ గా ఎస్‌.జె.సూర్య ఎప్పటిలాగే తన హుషారైన న‌ట‌న‌తో విల‌నిజం పండించారు. శ్రీకాంత్, జ‌యరాం, స‌ముద్ర‌ఖ‌ని, రాజీవ్ క‌న‌కాల, నవీన్ చంద్ర, సునీల్, నరేష్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి ఎస్.థమన్ సంగీతం సమకూర్చారు.

Tags:    

Similar News