లైకా Vs శంకర్ ఇష్యూ.. 'గేమ్ ఛేంజర్'కు బ్రేకులు..?
సినిమా విడుదలకు లైకా సంస్థ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఎస్. శంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ''గేమ్ ఛేంజర్''. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్ గా జనవరి 10వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకుంటున్న తరుణంలో ఈ సినిమాకి చిక్కులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలకు లైకా సంస్థ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
'గేమ్ ఛేంజర్' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంలో ఎస్‌విసి మరియు ఆదిత్య రామ్ మూవీస్ కలిసి విడుదల చేస్తున్నాయి. అయితే తమిళనాడులో విడుదలను నిలిపివేయాలని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తాజాగా తమిళ నిర్మాతల మండలిని సంప్రదించినట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ తమ బ్యానర్ లో 'ఇండియన్ 3' చిత్రాన్ని పూర్తి చేసే వరకూ ఆయన మరో సినిమా విడుదల చేయకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
'భారతీయుడు' సీక్వెల్ విషయంలో డైరెక్టర్ శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తమ సినిమాని పూర్తి చేసే వరకూ 'గేమ్ చేంజర్' చేయడానికి వీల్లేదంటూ లైకా టీం కోర్టుకు వెళ్లడంతో, రామ్ చరణ్ చిత్రంతో పాటుగా 'భారతీయుడు 2' మూవీని ఫినిష్ చేసారు శంకర్. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. అయినా సరే దీనికి మూడో భాగాన్ని ప్రకటించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే 'భారతీయుడు 3' మిగిలిన పెండింగ్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసే వరకూ, తమిళనాట 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని లైకా నిర్మాతలు మెలిక పెడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది.
'గేమ్ ఛేంజర్' సినిమాను ఆపడానికి లైకా ప్రొడక్షన్స్ ప్రయత్నిస్తున్నప్పటికీ, చట్టపరంగా వారి వాదన నిలబడటానికి అవకాశం లేదని విశ్లేషకులు అంటున్నారు. లైకా నుంచి ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాల ఫలితాలతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. దీనికి తోడు పొంగల్ కి విడుదల చేస్తామని చెప్పిన 'విదాముయార్చి' సినిమాని చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే లైకా పై తమిళనాడులోని ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నారు. కోలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో రిలీజయ్యే పెద్ద సినిమా 'గేమ్ ఛేంజర్' ఒక్కటే. కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం శంకర్ సినిమాని థియేటర్లలో విడుదల చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తే, ఎగ్జిబిటర్ల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది. మరి ఈ వివాదంలో తమిళ నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.