ఇండియన్ 3 రావాలంటే ఒక్కటే మార్గం
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా సూపర్ హిట్ కావాలి.
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబోలో చాలా ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమా తమిళ్‌తో పాటు అన్ని భాషల్లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లోనే సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ వసూళ్లు సొంతం చేసుకోవడం జరిగింది. ఆ సినిమాకు సీక్వెల్ అంటూ గడచిన అయిదు ఆరు సంవత్సరాలుగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఇండియన్ 2 సినిమా వచ్చింది. తమిళ్ బాక్సాఫీస్‌తో పాటు, అన్ని భాషల్లోనూ ఇండియన్ 2 సినిమా విడుదల అయ్యింది. కానీ ఏ ఒక్క భాషలోనూ సినిమా ఆకట్టుకోలేక పోయింది. వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని భావించిన ఇండియన్ 2 కనీసం పాతిక కోట్ల షేర్‌ను రాబట్టలేక పోయింది అంటూ విమర్శలు వచ్చాయి.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ సమయంలోనే ఇండియన్ 3 షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇండియన్ 2 డిజాస్టర్‌గా నిలవడంతో ఇండియన్ 3 థియేటర్ రిలీజ్ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇండియన్ 3 ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో అసలు కథ పార్ట్ 3 లో ఉంటుంది అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ రిలీజ్ అసాధ్యం కావచ్చు, కనుక ఓటీటీ లో సినిమా స్ట్రీమింగ్ చేస్తే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ దర్శకుడు శంకర్ మాత్రం ఇండియన్ 3 సినిమాను సరైన సమయంలో థియేటర్‌ల ద్వారా విడుదల చేస్తామని ప్రకటించారు.
ఇండియన్ 3 సినిమా థియేటర్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే ఒక్కటే మార్గం కనిపిస్తుంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా సూపర్ హిట్ కావాలి. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే విడుదల అయిన టీజర్, పాటలతో గేమ్ ఛేంజర్ సినిమా హిట్ అవుతుందేమో అని చాలా మంది ఆశగా ఉన్నారు. పైగా కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించడం వల్ల గేమ్ ఛేంజర్ సినిమా స్థాయి పెరిగింది. కనుక గేమ్ ఛేంజర్ కమర్షియల్‌గా హిట్ అయితే ఇండియన్ 3 కచ్చితంగా థియేటర్ రిలీజ్ కావడం ఖాయం.
కమల్ హాసన్ యంగ్ లుక్‌తో పాటు ఇండియన్ 3 లో చాలా ఉండబోతున్నాయి. ఇండియన్ 2 ప్రమోషన్ సమయంలోనే ఇండియన్ 3 లోనే మొత్తం కథ ఉంటుంది, ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాం అంటూ యూనిట్ సభ్యులు చెప్పిన విషయం తెల్సిందే. కమల్ హాసన్ సైతం ఇండియన్ 3 అద్భుతంగా ఉంటుంది అంటూ హామీ ఇచ్చారు. కనుక థియేటర్‌లలో ఇండియన్ 3 వస్తే కచ్చితంగా మంచి వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా థియేటర్‌లలో రావాలి అంటే గేమ్ ఛేంజర్ సినిమా కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియన్ 3 సినిమా విడుదల విషయంలో ఏం జరుగుతుందో తెలియాలి అంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.