ఆ డైరెక్టర్‌తో సమంత రిస్క్ చేస్తుందా?
మయోసైటిస్ నుంచి బయటపడి, ఇప్పుడు పూర్తిగా సినీకెరీర్ పై దృష్టి సారిస్తోంది అందాల సమంత
మయోసైటిస్ నుంచి బయటపడి, ఇప్పుడు పూర్తిగా సినీకెరీర్ పై దృష్టి సారిస్తోంది అందాల సమంత. దేవరకొండతో ఖుషి తర్వాత ఈ బ్యూటీ అటు హిందీ సహా ఇతర సినీపరిశ్రమలపైనా దృష్టి సారించింది. తాజా సమాచారం మేరకు సామ్ మలయాళంలో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలిసింది. అది కూడా తనను ఏమాయ చేశావే చిత్రంతో తమిళ తెరకు పరిచయం చేసిన గౌతమ్ మీనన్ తో కలిసి పని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
నిజానికి గౌతమ్ తొలి ఛాయిస్ నయనతార. వెటరన్ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన నటించాల్సి ఉంది. కానీ నయన్ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందని ప్రచారం సాగుతోంది. దీంతో నయన్ తర్వాత గౌతమ్ మీనన్ కి ఉన్న మరో గొప్ప ఛాయిస్ సమంత మాత్రమే. సామ్ కి పాన్ ఇండియా అప్పీల్ ఉంది. ఇది సినిమాకి కూడా పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట. ప్రస్తుతం సమంతతో మంతనాలు సాగించే పనిలో ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఈ ప్రాజెక్టుకి కమిటైతే సమంతకు కూడా ఇది మలయాళంలో డెబ్యూ సినిమా అవుతుంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
మరోవైపు సమంత ఫ్యాన్స్ ఇలాంటి ఒక అవకాశం వచ్చినా రిస్క్ చేయొద్దని సూచిస్తున్నారు. గౌతమ్ మీనన్ ఇటీవలి ట్రాక్ రికార్డ్ ఏమంత ఆశాజనకంగా లేదు. అతడు తలపెట్టిన ప్రాజెక్టులేవీ రిలీజ్ కి రావడం కూడా చాలా కష్టంగా మారింది. గత ప్రాజెక్టుల విషయంలో ఆర్థిక సమస్యలు, చట్టపరమైన సమస్యల్ని ఎదుర్కొన్నాడు. ఇలాంటి సమయంలో అతడు చేస్తున్న తదుపరి ప్రాజెక్ట్ ను సాఫీగా రిలీజ్ చేస్తాడా? డిలే లేకుండా చేయగలడా? అంటూ ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనను వెండితెరకు పరిచయం చేసిన గురువు ఆఫర్ ని సమంత రిజెక్ట్ చేసే ధైర్యం చేయగలదా? అన్నది చిక్కు ప్రశ్న. గౌతమ్ మీనన్ తో ఇప్పటికే ఏమాయ చేశావే చిత్రంలో నటించిన సమంత ఆ తర్వాత గౌతమ్ తెరకెక్కించిన `ఎటో వెళ్లిపోయింది మనసు` చిత్రంలో నటించింది. ఇందులో నాని కథానాయకుడిగా నటించాడు.