రేవంత్ రెడ్డితో మీటింగ్.. గీతా ఆర్ట్స్ ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది.

Update: 2024-12-26 14:39 GMT

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో తెలంగాణాలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అవ్వడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇండస్ట్రీ నుంచి దాదాపు 50 మంది ఈ మీటింగ్ కు వెళ్లారు. సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ నుంచి కూడా పోస్ట్ వచ్చింది.

''తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ స్టేజ్ మీదకు తీసుకెళ్లడంలో దార్శనిక నాయకత్వం మరియు స్థిరమైన మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఒక పరిశ్రమగా, ప్రభుత్వం యొక్క ప్రగతిశీల కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన పెంచడానికి, రాష్ట్రం ప్రారంభించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మేమంతా ఐక్యంగా అంకితభావంతో కృషి చేస్తాం. సమాజ అభివృద్ధికి, చిత్ర పరిశ్రమ యొక్క నిరంతర వృద్ధికి గణనీయమైన సహకారం అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము'' అని గీతా ఆర్ట్స్‌ సంస్థ ట్వీట్ చేసింది.

'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. దీనికి హీరో అల్లు అర్జున్ బాధ్యుడంటూ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ మరుసటి రోజు ఉదయాన్నే జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు 'రేవంత్ రెడ్డి Vs అల్లు అర్జున్' అనే విధంగా సోషల్ మీడియాలో పొజెక్ట్ చేయబడింది. రోజు రోజుకూ అది చిలికి చిలికి గాలివానలా మారి బన్నీ ఇంటిపై రాళ్ల దాడి చేసే వరకూ వెళ్ళింది. దీనికి అల్లు అరవింద్ చాలా బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు.

రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశానికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ''హైదరాబాద్‌ వరల్డ్ కేపిటల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవబోతోంది'' అని అన్నారు. ఇక సీఎంతో ఏయే అంశాలపై చర్చించారనేది దిల్ రాజు మీడియాకి వెల్లడించారు. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ కలిసి పని చేయడమే ప్రధాన అజెండాకి ఈ సమావేశం జరిగిందని తెలిపారు. తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తామని, హైదరాబాద్ ను సినిమాకి ఇంటర్నేషనల్ హబ్ గా చేయడానికి అడుగులు వేస్తామని చెప్పారు. కానీ ఈ మీటింగ్ లో అల్లు అర్జున్ వివాదం గురించి చర్చలు జరగలేదని పలువురు సినీ ప్రముఖులు చెప్పారు. అయితే రానా, బన్నీ అందరూ నాకు బాగా సన్నిహితులే.. అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? అని రేవంత్ రెడ్డి అన్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ వీలైనంత త్వరగా ఈ కేసు నుంచి బయటపడి ఈ వివాదానికి శుభం కార్డ్ పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News