గీత ఆర్ట్స్ 'ఛావా'.. కాంతార రేంజ్ లాభాలు వచ్చేనా?

గీతా ఆర్ట్స్ వ్యూహం చూడాలి అంటే, తక్కువ పెట్టుబడి పెట్టి హై ప్రాఫిట్స్ అందుకునేలా ప్లాన్ చేస్తారు.;

Update: 2025-03-07 04:51 GMT

పాన్ ఇండియా సినిమాలు తెలుగులో హిట్టవ్వాలంటే కంటెంట్‌కి తోడు, సరైన ప్రమోషన్, విడుదల వ్యూహం కూడా చాలా ముఖ్యం. గతంలో ‘కాంతార’ సినిమా తెలుగులో చిన్న రేంజ్‌లో విడుదలై ఊహించని విజయాన్ని సాధించింది. గీతా ఆర్ట్స్ దాదాపు 2.5 కోట్ల బిజినెస్‌తో తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేయగా, షేర్ పరంగా 29 కోట్లు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్‌కి 26.5 కోట్ల లాభాలను అందించింది. ఇలాంటి విజయం తర్వాత గీతా ఆర్ట్స్ మరోసారి ‘ఛావా’ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలనే ప్రయత్నం చేస్తోంది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో భారీ హిట్‌గా నిలిచింది. అక్కడ ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని ముందుగా చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి కనబరిచారు. కానీ చివరకు గీతా ఆర్ట్స్ దీని రైట్స్ తీసుకుంది. పెద్దగా నష్టాలు రాకుండా రీజనబుల్ ధరకే సినిమాకు హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో ‘ఛావా’ సినిమా బిజినెస్ ఎంతకూ సెట్టైంది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభించకపోయినా, చాలా తక్కువ రేటుకే గీతా ఆర్ట్స్ ఈ సినిమా రైట్స్ పొందిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గీతా ఆర్ట్స్ వ్యూహం చూడాలి అంటే, తక్కువ పెట్టుబడి పెట్టి హై ప్రాఫిట్స్ అందుకునేలా ప్లాన్ చేస్తారు. కాంతార లాగే ‘ఛావా’ కూడా హిట్ అయితే, మరోసారి జాక్ పాట్ కొట్టినట్లే.

కాంతార మౌత్ టాక్‌తో క్రమంగా వసూళ్లు పెంచుకున్న సినిమా. కానీ ‘ఛావా’ హిందీలో పెద్ద విజయం సాధించడం, అక్కడి మౌత్ టాక్ తెలుగు మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించొచ్చు. అయితే తెలుగులో ఈ సినిమాకు ఎలాంటి రిసెప్షన్ వస్తుందనేది చూడాలి. తెలుగు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, మరింత వసూళ్లు రాబట్టాలంటే ఫస్ట్ వీక్ ఓపెనింగ్స్, వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం అవుతుంది. తెలుగు బిజినెస్ పరంగా, ‘ఛావా’ కనీసం 20 కోట్లు షేర్ అయితే సాధించగలిగితే, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలే వచ్చే అవకాశం ఉంది.

అయితే ఆ సంఖ్యను అందుకోవాలంటే, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావాలి. గీతా ఆర్ట్స్ గతంలో ‘కాంతార’తో సక్సెస్ అందుకున్నా, అదే మిరాకిల్ మళ్లీ రిపీట్ అవుతుందా అనేది అనుమానాస్పదంగా మారింది. ఎందుకంటే మరోవైపు, తెలుగులో ‘ఛావా’కి పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. చిన్న రేంజ్ సినిమాలు పెద్దగా పోటీగా లేనప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు రీ రిలీజ్ కొంత పోటీని ఇచ్చే అవకాశం ఉంది. పైగా మార్చి నెల అంటే ఎగ్జామ్స్ టైమ్. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే ఛాన్స్ తక్కువ. అయితే ఫస్ట్ వీకెండ్ హైపుతో గట్టిగా ఓపెన్ అయితే, తర్వాత వారాల్లో స్టడీగా నడిపించుకునే ఛాన్స్ ఉంటుంది. మరి, ‘ఛావా’ తెలుగులోనూ కాంతార మిరాకిల్ రిపీట్ చేస్తుందా గీతా ఆర్ట్స్ మరోసారి లాభాలు గడిస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News