టాలీవుడ్: ఆ బేస్ అంటే సూపర్ హిట్టే..

గోదారి బేస్ తో సినిమా తీస్తే చాలు.. మూవీ సూపర్ హిట్ అన్న విధంగా అందరితో అనిపిస్తున్నారు.

Update: 2024-09-17 14:30 GMT

గోదావరి.. ఈ పేరు వింటే చాలు.. టక్కున ఎవరికైనా గుర్తొచ్చేవి.. పచ్చని కోక కట్టుకున్న అందమైన కోనసీమ, కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు, పులస చేప, మర్యాదలు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు స్పెషల్స్ ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ప్రకృతి, పరవళ్లు తొక్కే నదీ జలాలతో ఉండే గోదావరి ప్రాంతాన్ని ఇష్టపడని వారు ఉండరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. లైఫ్ లో ఒక్కసారి అయినా.. గోదావరి అందాలు చూడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కచ్చితంగా ఆ అద్భుతమైన అనుభూతి పొందాలని ప్లాన్ చేసుకుంటారు.

అయితే అలాంటి గోదావరి అందాలను.. కొద్ది రోజులుగా ఎక్కువగా సినిమాల్లో చూస్తున్నాం.. గోదారి బేస్ తోనే మూవీలు వస్తున్నాయి.. అరే అవును కదా అని అనిపిస్తుందా.. అవును నిజమే.. కొంతకాలంగా టాలీవుడ్ మేకర్స్ గోదావరి బ్యాక్ డ్రాప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారని క్లియర్ గా కనబడుతోంది. బ్యాక్ డ్రాప్ మాత్రమే కాదు.. అక్కడే షూటింగ్స్ కూడా చేస్తున్నారు. హై టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ తో షూట్ చేసి.. సినీ ప్రియులకు మంచి ఎక్స్పీరియన్స్ అందిస్తున్నారు. అదే సమయంలో బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అందుకుంటున్నారు.

గోదారి బేస్ తో సినిమా తీస్తే చాలు.. మూవీ సూపర్ హిట్ అన్న విధంగా అందరితో అనిపిస్తున్నారు. ఇప్పటికే గోదావరి బ్యాక్ డ్రాప్‌ లో ఎన్నో సినిమాలను మన తెలుగు దర్శకులు తెరకెక్కించారు. అవన్నీ మంచి హిట్స్ గా నిలిచాయి. అయితే కొద్ది రోజులుగా ఆ నేప‌థ్యంతోనే ఎక్కువ చిత్రాలు వస్తున్నాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి స్టార్ట్ అయిన గోదారి ట్రెండ్.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నార్నే నితిన్ ఆయ్, మెగా డాటర్ నిహారిక డెబ్యూ ప్రొడక్షన్ మూవీ కమిటీ కుర్రోళ్ళు చిత్రాలతో కంటిన్యూ అవుతోంది.

అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టైటిల్ లో గోదావరి పేరును కూడా ఇన్క్లూడ్ చేసేశారు మేకర్స్. టైటిల్ తగ్గట్టే సినిమాను కూడా తెరకెక్కించారు. ప‌చ్చ‌టి ప‌ల్లెసీమ‌లు, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణ‌ం కాకుండా.. డైరెక్టర్ కృష్ణ‌చైత‌న్య సినిమాలో ఎరుపెక్కిన గోదావ‌రిని చూపించారు. లంక గ్రామాల్లోని ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో యువ‌కుడి ప్ర‌యాణాన్ని లింక్ చేస్తూ క‌థ‌ను తీర్చిదిద్దారు. కేవలం లంక గ్రామాల్లో ఉండే క‌త్తి పట్టే సంప్ర‌దాయాన్ని అద్భుతంగా చూపించారు. ఓవరాల్ గా సినిమా అంతా.. గోదావరి బ్యాక్ డ్రాప్ తో ఆకట్టుకుంటూ సాగుతోంది.

ఇక ఆయ్ లో గోదావరి జిల్లాలోని అమలాపురానికి చెందిన కుర్రాడిగా హీరోను చూపించారు దర్శకుడు అంజి కె.మ‌ణిపుత్ర. సినిమా కథలో హాస్యం, స్నేహం ముఖ్య అంశాలుగా రాసుకున్నారు. అమ‌లాపురం ప్రాంతానికి చెందిన మ‌నుషుల్లో ఎప్పుడూ క‌నిపించే అమాయ‌క‌త్వం, పట్టింపులు, ఆప్యాయత, వెటకారం.. అలా అన్ని విషయాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా కులం కంటే స్నేహమే గొప్పదన్న విషయాన్ని మరోసారి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు డైరెక్టెర్. కులాలే చూస్తున్నారు కానీ.. మనిషికి మనిషి హెల్ప్ చేసుకోవడం లేదనే విషయాన్ని లవ్ స్టోరీతో తెలిపారు. అటు గోదారి బ్యాక్ డ్రాప్.. ఇటు సామాజిక అంశంతో రూపొందిన ఆయ్ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది.

మరోవైపు.. కమిటీ కుర్రోళ్లు మూవీ స్టోరీ అంతా గోదావ‌రి గ్రామంలో జ‌రిగే ఓ జాత‌ర చుట్టూ తిరుగుతోంది. స్నేహం, ప్రేమ‌, కులాలు, పాలిటిక్స్ ను యాడ్ మంచి సినిమాగా ఆవిష్కరించారు దర్శ‌కుడు య‌దు వంశీ. 80-90ల జెనరేషన్ కు బోలెడు మెమోరీస్ ను గుర్తు చేశారు. క‌లిసిమెల‌సి పెరిగి తిరిగిన కుర్రాళ్ళ మ‌ధ్య కులాల రిజ‌ర్వేష‌న్స్ గురించి స్టార్ట్ అయిన గొడవను ఓ గ్యాంగ్ త‌మకు అనుకూలంగా వాడుకునే తీరును ఆసక్తి రేపేలా చూపించారు. అలా గోదారి నేపథ్యంతో వచ్చిన కమిటీ కుర్రోళ్ళు మూవీ కూడా హిట్ అయింది. మరి ఈ మూడు చిత్రాల సంగతి పక్కన పెడితే.. ఫ్యూచర్ లో గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఇంకా ఎన్ని సినిమాలు వస్తాయో? ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News