పాన్ ఇండియా ట్రెండ్‌తో రచయితల్లో డైలమా?
నిజానికి ఈ పరిణామం చాలా గందరగోళానికి దారి తీసిందని తాజాగా ప్రముఖ రచయిత గోపి మోహన్ వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో పాన్ ఇండియన్ సినిమా హవా కొనసాగిస్తోంది. ఎవరు సినిమా తీయాలనుకున్నా పాన్ ఇండియా ప్రామాణికత కావాలని తపిస్తున్నారు. అంతేకాదు.. చిన్న పెద్ద దర్శకరచయితలు కూడా పాన్ ఇండియా కథలను ఎంపిక చేసుకుని అన్ని భాషల్లో తమ సినిమాని వర్కవుట్ చేయాలనే కసితో కనిపిస్తున్నారు. నిజానికి ఈ పరిణామం చాలా గందరగోళానికి దారి తీసిందని తాజాగా ప్రముఖ రచయిత గోపి మోహన్ వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి.
శ్రీను వైట్ల వంటి అగ్ర దర్శకుడి వద్ద రచయితగా పని చేసిన ప్రముఖ రచయిత గోపి మోహన్. అతడు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్ ప్లేలు, డైలాగులు అందించారు. టెక్నీషియన్లతో కలిసి పని చేసిన అనుభవజ్ఞుడు. అయితే త్వరలో రిలీజ్ కి రాబోతున్న ఓ కామెడీ ఎంటర్ టైనర్ కి రచనా విభాగంలో పని చేసిన గోపి మోహన్ ఈ సినిమా గురించి ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో నిజ జీవితంలో రెగ్యులర్ గా కనిపించే పాత్రలతో సినిమా తీయాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. లోకల్ క్యారెక్టర్లు కనుమరుగయ్యాయని కూడా అన్నారు.
ఈమధ్య అంతా లోకల్ టైప్ పాత్రలు పోయి పాన్ ఇండియా పాత్రలు వచ్చాయి. ఏలియన్ పాత్రలు పుట్టుకొస్తున్నాయ్. దీనివల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్లు లేవు. మధ్యతరగతి ప్రజలకు కనెక్టయ్యే పాత్రలు లేవు. బాహుబలి వచ్చినప్పటి నుంచి ఆ ట్రెండ్ మారిపోయిందని గోపి మోహన్ అన్నారు.
ప్రస్తుతం తాను ఒక లోకల్ పాత్రలతో సాగే సినిమాకి పని చేసినట్టు గోపి మోహన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. డెస్టినేషన్ వెడ్డింగ్ నేపథ్యంలో సెకండాఫ్ కొనసాగుతుంది. ఫస్టాఫ్ అనేది సెకండాఫ్ ఎస్టాబ్లిష్ మెంట్ కి సంబంధించిన పాత్రల పరిచయాలు సన్నివేశాలతో సాగుతుందని అన్నారు. ప్రతి సన్నివేవానికి కనెక్ట్ అయి ఆడియెన్ సినిమా చూస్తారని ప్రామిస్ చేసారు.
పాన్ ఇండియా ట్రెండ్‌పై గోపి మోహన్ వ్యాఖ్యలను బట్టి, ఇటీవల తెలుగు సినిమా రైటర్లు కొంత గందరగోళానికి గురయ్యారని కూడా అర్థం చేసుకోవచ్చు. సహజసిద్ధంగా మన చుట్టూ కనిపించే మనుషులను గమనించి, పాత్రలను ఎంపిక చేసుకుని అనవసరమైన ఫిక్షనలైజేషన్ లేకుండా కామెడీ టచ్ తో సీన్లు రాసే ట్రెండ్ ఇటీవల మటుమాయమైంది. నిజానికి తెలుగు చిత్రసీమలో ఎక్కువగా ఉపాధి పొందుతున్నది ఈ తరహా రచయితలే. నిజ జీవితంలో కనిపించే పాత్రలు, సన్నివేశాలతోనే వీరంతా కాన్సెప్టులు డిజైన్ చేస్తారు.
కానీ అనూహ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ ప్రవేశించడం.. యూనివర్శల్ అప్పీల్ కోసం ప్రయత్నించడంతో పాత్రల క్రియేషన్ చాలా మారిపోయింది. పాన్ ఇండియా పేరుతో ఫిక్షనల్ పాత్రలు పెరిగాయి. బాహుబలి తో లార్జర్ దేన్ లైఫ్ పాత్రల పరిచయం మొదలై సాహో, హను-మ్యాన్, కల్కి 2898 ఏడి వంటి చిత్రాలతో ఫిక్షనల్ సూపర్ హీరో పాత్రలు పుట్టుకొచ్చాయి. కొంతవరకూ ఈ ట్రెండ్ ని క్యాచ్ చేసి, హను-మ్యాన్ లాంటి సినిమా తీసి నేటితరం దర్శకరచయితల్లో ప్రశాంత్ వర్మ పెద్ద సక్సెసయ్యాడని చెప్పొచ్చు. రొటీన్ థింకింగ్ నుంచి బయటపడి లాజికల్ థింకింగ్ తో ఆలోచించే, ప్రస్తుత ట్రెండ్ కి కనెక్టయ్యే కథలు, పాత్రలను క్రియేట్ చేసే రచయితలకు భవిష్యత్ ఉంటుందని అర్థమవుతోంది.