తిండి లేదు... సైకిల్ పై ఆఫీస్ ల చుట్టూ...!
ఆ సందర్భంగా పలు విషయాలను గోపీచంద్ ప్రేక్షకులతో పంచుకున్నాడు.
యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన భీమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈటీవీలో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా సీజన్ లో గోపీచంద్ పాల్గొన్నాడు. ఆ సందర్భంగా పలు విషయాలను గోపీచంద్ ప్రేక్షకులతో పంచుకున్నాడు.
దర్శకుడు హర్ష కథ రాసుకున్న సమయంలోనే భీమా అనే టైటిల్ ను అనుకున్నట్లుగా చెప్పాడు. టైటిల్ నాకు కూడా బాగా నచ్చడంతో దాన్నే కంటిన్యూ చేశాం. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని గోపీచంద్ అన్నాడు.
ఇంకా గోపీచంద్ మాట్లాడుతూ తన కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి చెప్పుకొచ్చాడు. మా నాన్న గారికి విద్య ను అందించాలనే కోరిక ఉండేది. ఆయన ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన స్కూల్ ను మేము కంటిన్యూ చేయలేక పోయాం. అయితే నేను నా వంతుగా కొంత మందిని చదివిస్తున్నాను. వారికి నేను చదివిస్తున్నాను అని కూడా తెలియదు.
చేసేది మంచి పని అయినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అనేది నా అభిప్రాయం. అందుకే నేను ఎప్పుడు కూడా నేను చేసే కార్యక్రమాల గురించి చెప్పాలి అనుకోను. నేను చదివించిన పిల్లల్లో చాలా మంది మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడటం సంతోషాన్ని కలిగించింది అన్నాడు.
కెరీర్ ఆరంభంలో చెన్నై రోడ్ల మీద తిరుగుతూ పడ్డ కష్టాలను గురించి కూడా గోపీచంద్ చెప్పుకొచ్చాడు. తినడానికి తిండి కూడా లేని సమయం అది. అయినా కూడా ఎవరి వద్ద చేయి చాచకూడదని బలంగా భావించాను. సైకిల్ వేసుకుని ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ ఆఫర్ల కోసం ప్రయత్నించాను. ఇప్పటి వారికి ఆ జీవితం తెలియదు. జీవితం అంటే ఇది కాదు అది అని నేను చాలా మందితో అంటూ ఉంటాను అని గోపీచంద్ పేర్కొన్నాడు.
ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ను చవిచూస్తున్న గోపీచంద్ తాజా చిత్రం భీమా పై చాలా నమ్మకంతో కనిపిస్తున్నాడు. మరి ఆయన నమ్మకం నిలబడి భీమా హిట్ కొట్టి మరి కొంత కాలం గోపీచంద్ హీరోగా నిలిచేలా బూస్ట్ ను ఇస్తుందా అనేది చూడాలి.