అవార్డుల‌ మూవీ 'గ‌ల్లీబోయ్‌' సీక్వెల్ ప్లాన్

ప్ర‌ముఖ బాలీవుడ్ ర‌చ‌యిత‌ జావేద్ అక్త‌ర్ కుమార్తె, ద‌ర్శ‌క‌న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ సోద‌రి అయిన జోయా అక్త‌ర్ ఈ మోడ్ర‌న్ డే క్లాసిక్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Update: 2025-01-14 11:30 GMT

మ‌రో వందేళ్ల త‌ర్వాత చూసినా అదే ఫ్లేవ‌ర్ తో ఆస్వాధించే కొన్ని అరుదైన సినిమాలు మ‌న‌కు ఉన్నాయి. టాలీవుడ్ క్లాసిక్ డే హిట్స్ పాతాళ భైర‌వి, మాయా బ‌జార్, మిస్స‌మ్మ ఈ కేట‌గిరీకే చెందుతాయి. నేటి జెన్ జెడ్ త‌రంలో అలాంటి ఒక హిందీ సినిమా గురించి చెప్పాల్సి వ‌స్తే అది క‌చ్ఛితంగా - గ‌ల్లీబోయ్. ప్ర‌ముఖ బాలీవుడ్ ర‌చ‌యిత‌ జావేద్ అక్త‌ర్ కుమార్తె, ద‌ర్శ‌క‌న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్ సోద‌రి అయిన జోయా అక్త‌ర్ ఈ మోడ్ర‌న్ డే క్లాసిక్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

గ‌ల్లీబోయ్‌లో ప్ర‌తి ఫ్రేమ్ ని ఒక అంద‌మైన క‌విత‌లా తీర్చిదిద్దారు ద‌ర్శ‌కురాలు. ర‌ణ్‌వీర్ సింగ్- ఆలియా భ‌ట్ జంట‌ను అంతే బ్యూటిఫుల్ ప్రేమికులుగా తెర‌పై చూపించారు. ఈ సినిమా 2019లో ప్ర‌తిష్ఠాత్మ‌క ఫిలింఫేర్ లు సహా ప‌లు అంత‌ర్జాతీయ‌ అవార్డుల‌ను కొల్ల‌గొట్టింది. గ‌ల్లీ నుంచి అంత‌ర్జాతీయ వేదిక‌పై ఎదిగే ఒక మురికివాడ స్ట్రీట్ ర్యాప‌ర్ క‌థే గ‌ల్లీబోయ్. ప్రేమ‌, పేద‌రికం, కెరీర్ ప్ర‌యాణం నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మిది. ర‌ణ్ వీర్ ఒక పేద ర్యాప‌ర్ గా న‌టించ‌గా, ఆలియా ముస్లిమ్ యువ‌తిగా అద్భుతంగా న‌టించింది. ముఖ్యంగా ఈ సినిమాని తెర‌కెక్కించిన విధానం, పాత్ర‌ల చిత్ర‌ణ‌, అద్భుత‌మైన‌ స్క్రీన్ ప్లే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. వీట‌న్నిటినీ మించి ఈ సినిమా మ్యూజిక్, నేప‌థ్య సంగీతం థియేట‌ర్ల‌లో వీక్షిస్తున్నంతసేపూ ఆడియెన్ ని కుర్చీ అంచుకు చేరుస్తాయి.

అలాంటి ఒక సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని హిందీ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత గల్లీబోయ్ సీక్వెల్ గురించిన తాజా అప్ డేట్ ఇది. ఈ సీక్వెల్‌లో విక్కీ కౌశల్ , అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారని, ఇది గల్లీ బాయ్ విశ్వంలో ఒక ఎగ్జ‌యిటింగ్ చాప్ట‌ర్ అవుతుంద‌ని స‌మాచారం. అయితే ఈసారి సీక్వెల్ చిత్రానికి జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం లేదు. గతంలో ఖో గయే హమ్ కహాన్‌కు దర్శకత్వం వహించిన అర్జున్ వరైన్ సింగ్ దర్శకత్వం వహిస్తార‌ని స‌మాచారం. జోయా తెర‌కెక్కించిన సినిమా నుంచి ప్ర‌ధాన థీమ్ ని ఎంచుకున్నా కానీ, పూర్తి విభిన్న‌మైన క‌థాంశంతో సీక్వెల్ ని తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది. అయితే జోయా అక్త‌ర్ త‌ర‌హాలో పోయెటిక్ గా స్క్రీన్ ప్లేని మ‌ల‌చ‌డంలో అర్జున్ వరైన్ ఏమేర‌కు స‌క్సెస‌వుతారో వేచి చూడాలి. గ‌ల్లీబోయ్ విజ‌యంలో పోయెటిక్ ఎప్రోచ్ కీల‌క పాత్ర‌ను పోషించింది.

అవార్డులే అవార్డులు:

65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో గల్లీ బాయ్ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి సహా 13 అవార్డులను గెలుచుకుంది. ఇది స్క్రీన్ అవార్డులు, జీ సినీ అవార్డులలో కూడా అవార్డులను గెలుచుకుంది.

*ఫిల్మ్‌ఫేర్ అవార్డులు: ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి స‌హా 10 ఇతర అవార్డులు

*స్క్రీన్ అవార్డులు: 12 అవార్డులు

*జీ సినీ అవార్డులు: 9 అవార్డులు

* బుచియోన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్: ఉత్తమ ఆసియా చిత్రంగా NETPAC అవార్డు

Tags:    

Similar News