గుణశేఖర్ ఈసారి ప్రయోగమే.. కానీ..
‘యుఫోరియా’ చిత్రం చెడును చూపించి చివర్లో ఒక సందేశం ఇవ్వాలనే ప్రయత్నం చేయబోతున్నట్లుగా కనిపిస్తోంది.
ఒక్కడు, చూడాలని వుంది సినిమాలతో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు గుణశేఖర్. ఇక 'రుద్రమదేవి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే, అదే తరహాలో తెరకెక్కించిన 'శాకుంతలం' మాత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ సినిమా కమర్షియల్ పరంగా కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్లు అంచనాలకు తక్కువగా ఉండటంతో గుణశేఖర్ కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చింది.
'శాకుంతలం' తర్వాత గుణశేఖర్ కొంచెం సమయం తీసుకొని కొత్త ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేశారు. అలా ట్రెండుకు తగ్గట్లుగా తెరకెక్కించబోతున్న కొత్త చిత్రం 'యుఫోరియా'. ఈ సినిమా ద్వారా గుణశేఖర్ మరోసారి ట్రెండీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమాకి ఎంచుకున్న టైటిల్ 'యుఫోరియా' అని వినిపించినప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. అయితే, ఇటీవల విడుదలైన టీజర్ గ్లింప్స్ చూసిన తర్వాత, టైటిల్ అచ్చంగా సరిపోయిందని చెప్పుకోవచ్చు.
టీజర్ గ్లింప్స్ చూస్తే, ఈ సినిమా సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం, మహిళలపై లైంగిక దాడుల వంటి తీవ్రమైన సమస్యల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. గుణశేఖర్ ఈ కాలంలో ప్రాధాన్యత కలిగిన ఈ సమస్యలను తన సినిమాలో ప్రదర్శించబోతున్నాడు. గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్ కూడా ఈ అంశాలను స్పష్టంగా హైలైట్ చేస్తాయి.
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, 'యుఫోరియా'లో ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం వల్ల యువత అనేక రకాల సమస్యలకు గురవుతున్నారని, అదే సమయంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు వంటి విషయాలను ప్రధానంగా ఫోకస్ చేస్తుందని తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ కచ్చితంగా సమాజానికి సంబంధించి ఉన్న యధార్థ విషయాలను కలిగి ఉండడంతో, ప్రేక్షకులను ఈ చిత్రానికి ఆకర్షించే అవకాశం ఉంది.
అయితే, ట్రెండీ కాన్సెప్ట్ ఉండటం ఎంత వాస్తవమో, టేకింగ్ విషయంలో గుణశేఖర్ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాడని చాలామంది భావిస్తున్నారు. టీజర్ గ్లింప్స్‌లో చూపించిన కొన్ని సీన్లు చూసినప్పుడు, ఒక రకమైన అలజడి కలిగించే దృశ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా లైంగిక దాడులు, డ్రగ్స్ వినియోగంపై ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తికరమైన విషయం. సినిమా మొత్తం ఈ అంశాల చుట్టూ తిరుగుతుందని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.
'యుఫోరియా' చిత్రం చెడును చూపించి చివర్లో ఒక సందేశం ఇవ్వాలనే ప్రయత్నం చేయబోతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే, ఈ రకమైన కష్టమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్న గుణశేఖర్, సినిమా చివరకు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో సీనియర్ నటి భూమిక చావ్లా, కొత్త నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గుణశేఖర్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.