వారి విడాకులతో నాకేం సంబంధం.. హీరోయిన్‌ క్లారిటీ

తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఇటీవల భార్య సైంధవికి విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే.

Update: 2025-02-20 12:30 GMT

తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఇటీవల భార్య సైంధవికి విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. వీరిద్దరి జోడీని అభిమానించే వారు చాలా మంది ఉంటారు. జీవీ ప్రకాష్, సైంధవి విడాకుల సమయంలో హీరోయిన్‌ దివ్య భారతి పేరు ప్రముఖంగా వినిపించింది. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన 'బ్యాచిలర్‌' సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి దివ్య భారతితో జీవి ప్రకాష్ ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ ప్రేమ కారణంగానే సైంధవితో జీవీ ప్రకాష్ విడాకులు తీసుకున్నాడు, త్వరలోనే దివ్య భారతిని జీవీ ప్రకాష్ పెళ్లి చేసుకుంటాడు అనే వార్తలు జోరుగా వినిపించాయి. తమిళ మీడియాలోనూ అదే ప్రచారం జరిగింది.

మీడియాలో జరిగిన ప్రచారం నేపథ్యంలో జీవీ ప్రకాష్, సైంధవి అభిమానులు ఎంతో మంది హీరోయిన్‌ దివ్య భారతిని సోషల్‌ మీడియా ద్వారా బూతులు తిట్టేవారు. చాలా మంది ఆమె వల్లే జీవీ ప్రకాష్ తన భార్య సైంధవికి విడాకులు ఇస్తున్నాడని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. కోలీవుడ్‌ నుంచి దివ్య భారతిని బాయ్‌కాట్‌ చేయాలని కూడా కొందరు డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో దివ్య భారతిని బండ బూతులు తిటిన వారు చాలా మంది ఉన్నారు. ఆ విషయాలను గురించి హీరోయిన్‌ దివ్య భారతి, జీవీ ప్రకాష్‌లు తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య ఏమీ లేదని, ఇద్దరం నటీ నటులుగా మాత్రమే క్లోజ్‌గా ఉంటామని ఇద్దరూ చెప్పుకొచ్చారు.

జీవీ ప్రకాష్‌, దివ్య భారతి కలిసి 'కింగ్‌స్టన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దివ్య భారతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బ్యాచిలర్‌ సినిమా కోసం తాను జీవి ప్రకాష్‌తో కలిసి వర్క్ చేశాను. అప్పటి నుంచి తనను కొందరు టార్గెట్‌ చేశారు. ఆ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. సినిమాలోనే కాకుండా బయట కూడా మేము ఇద్దరం కలిసి ఉన్నాం, ఇద్దరి మధ్య ప్రేమ ఉందని కొందరు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దాంతో జీవీ ప్రకాష్, సైంధవిలు విడాకులు తీసుకున్న సమయంలో చాలా మంది తానే కారనం అంటూ దూషించారు. నన్ను తిట్టిన వారిలో ఎక్కువ మంది ఆడవారు ఉన్నారంది. వారి విడాకులతో తనకు ఎలాంటి సంబంధం లేదు. విడాకుల తర్వాత వారిద్దరు కలిసి కాన్సర్ట్‌ చేస్తే చాలా సంతోషించాను. దాంతో నాపై విమర్శలు ఆగుతాయని అనుకున్నాను. అయినా నన్ను తిడుతూనే ఉన్నారు. నన్ను తిట్టిన మెసేజ్‌లను అప్పుడప్పుడు జీవీకి పంపించేదాన్ని అంది.

జీవీ ప్రకాష్ మాట్లాడుతూ... దివ్యతో కలిసి తాను పలు ప్రాజెక్ట్‌లు చేయడం వల్ల మంచి స్నేహం ఉంది. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప అంతకు మించి ఏమీ లేదు. కెరీర్ విషయంలో నేను, సైంధవి చాలా సీరియస్‌గా ఉంటాం. మేము ఇద్దరం క్రమశిక్షణ కలిగిన ఆర్టిస్టులం. అందుకే విడాకులు తీసుకున్న తర్వాత కూడా కన్సర్ట్‌ చేసేందుకు ఒప్పుకున్నామని జీవీ ప్రకాష్‌ అన్నాడు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడం కోసం తాను ఎవరితో అయినా కలిసి వర్క్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరి ప్రకటనతో అయినా దివ్య భారతిపై విమర్శలు తగ్గేనా చూడాలి.

Tags:    

Similar News