అదృష్ణం తలుపు తట్టింది కానీ..వీరితో కాలం ఆడుకుంది!
కొంత మందికి అనుకోకుండా అదృష్టం తలుపుతడుతూ ఉంటుంది. మరి కొంత మందికి అదృష్టం తలుపు తట్టినా ఫలితం ఉండదు.;

కొంత మందికి అనుకోకుండా అదృష్టం తలుపుతడుతూ ఉంటుంది. మరి కొంత మందికి అదృష్టం తలుపు తట్టినా ఫలితం ఉండదు. అదృష్టం కలిసొచ్చినా వీరితో కాలం ఆడుకుని వచ్చిన అవకాశాన్ని కాలరాస్తూ ఉంటుంది. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక.. దాన్ని వదులుకోలేక టైమ్ వేస్ట్ చేస్తూ మానసిక సంఘర్షణకు లోనవుతుంటారు. సరిగ్గా ఇదే పరిస్థితిని గత కొన్నేళ్లుగా ఇద్దు టాలీవుడ్ డైరెక్టర్స్ అనుభవిస్తున్నారు. ఎదురు చూడని అవకాశం వచ్చిందని ఎగిరి గంతేసిన ఈ డైరెక్టర్లకు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.
దీంతో ఆ ఇద్దరి డైరెక్టర్ల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఇంతకీ ఈ పరిస్థితిని గత కొన్నేళ్లుగా అనుభవిస్తూ మానసిక సంఘర్షణకు లోనవుతున్న దర్శకులు మరెవరో కాదు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, క్రిష్ జాగర్లమూడి. వీరిద్దరికి ఎదురు చూడకుండానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్ `ఉస్తాద్ భగత్‌సింగ్` మూవీని దక్కించుకుంటే, క్రిష్ జాగర్లమూడి `హరి హర వీరమల్లు`ని తెరకెక్కించే ఛాన్స్ అందుకున్నారు.
విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో `హరి హర వీరమల్లు` షూటింగ్ పలు దఫాలగా వాయిదా పడుతూ దర్శకుడు క్రిష్ సహనాన్ని పరీక్షించింది. దీనికి ప్రధాన కారణం పవన్ క్రీయాశీల రాజకీయాలలో బిజీగా ఉండటం, సినిమా షూటింగ్‌లకు డేట్స్ కేటాయించలేకపోవడంతో ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వాయిదాపడుతూ వచ్చి చివరికి క్రిష్ ఫస్ట్ పార్ట్ తరువాత చేతులు ఎత్తేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఆ బాధ్యతల్ని నిర్మాత ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకోవడం తెలిసిందే. ఈ సినిమా నుంచి తప్పుకున్న క్రిష్ ప్రస్తుతం అనుష్క కీలక పాత్రలో `ఘాటీ` మూవీని తెరకెక్కిస్తున్నాడు.
అనుష్క పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ మూవీని ఈ నెల 18న ఐదు భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదే తరహాలో హరీష్ శంకర్ కూడా పవన్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాడు. ఆయనతో `ఉస్తాద్ భగత్‌సింగ్`ని ప్లాన్ చేసిన హరీష్ కొంత వరకు షూటింగ్ చేశాడు. పవన్‌కు టైమ్ లేకపోవడం, రాజకీయాల్లో బిజీగా ఉండటంతో నెలలు గడుస్తున్న ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు. ఇక పవన్‌తో కష్టమని భావించిన హరీష్ శంకర్ పక్కదారులు వెతుక్కుంటూ ఇతర హీరోలతో సినిమాలు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే రామ్‌ని ఒప్పించిన హరీష్ త్వరలో నందమూరి బాలకృష్ణతోనూ ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాని తెరపైకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇలా ఇద్దరి దర్శకులు పవన్ కోసం ఎదురు చూసి చూసి చివరికి వేరే వాళ్లతో సినిమాలు చేయాల్సి వస్తోంది. వీళ్లని అదృష్టం వరించినా టైమ్ ఆడుకోవడంతో వచ్చిన అవకాశాన్ని అనుకున్నంత ఆనందంగా ఆస్వాదించలేకపోవడం గమనార్హం.