ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ రియల్ సీన్!
ఈ మూడు చిత్రాల్లో హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత పరంగా చివరిలో ఉన్నా, హరీష్ మాత్రం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థెరి రీమేక్ అనగానే ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి స్టార్ట్ అయ్యింది. కానీ దర్శకుడు హరీష్ మాత్రం మీరు ఊహించని విధంగానే సినిమా మంచి కంటెంట్ తో ఉంటుందని ఎప్పటికప్పుడు ఎలివేషన్స్ అయితే ఇస్తున్నాడు. రీమేక్ లో మంచి అనుభవం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ లో టెన్షన్ అయితే తగ్గడం లేదు. అసలే ఇటీవల హిందీ రీమేక్ రెయిడ్ ను మిస్టర్ బచ్చన్ గా తీసి డిజాస్టర్ అందుకున్నాడు.
దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది అనేది, అప్డేట్స్ వచ్చే వరకు చెప్పలేని పరిస్థితి. పవన్ సినిమాల్లో ఈ సినిమా కంటే ఎక్కువగా ఓజి సినిమాకే బజ్ ఎక్కువగా ఉంది. మరోవైపు హరిహర వీరమల్లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నప్పటికీ, ప్రమోషన్ లోపంతో కావాల్సినంత హైప్ తీసుకురాలేకపోతోంది. ఈ మూడు చిత్రాల్లో హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత పరంగా చివరిలో ఉన్నా, హరీష్ మాత్రం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు.
ఈ సినిమా హరీష్ శంకర్‌కు ఎంతో ముఖ్యమైనది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితంతో కొంత నిరాశ చెందిన హరీష్, మళ్లీ తానేంటో నిరూపించుకునే అవకాశంగా ఈ సినిమాను చూస్తున్నాడు. కొంతవరకు పవన్ అభిమానుల్లో హరీష్ శంకర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గబ్బర్ సింగ్ సినిమాతో మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న హరీష్, ఈసారి మరింత స్టైలిష్‌గా పవన్‌ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇటీవల జరిగిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ ఆసక్తికరమైన లీక్ ఇచ్చాడు. ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపులో కూర్చున్న స్టిల్ ఇప్పటికి కూడా బెస్ట్ మూమెంట్. ఆయన వెనుక వేలాదిగా అభిమానులు బైకులు, కార్లలో ఫాలో అవుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఇదే సీన్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హరీష్ రీ-క్రియేట్ చేస్తున్నట్టు వెల్లడించాడు.
అలాంటిది ఒక రీమేక్ సినిమాలో ఎలా ఇమిడుతుందనే సందేహం సహజం. కానీ హరీష్ శంకర్ తన స్టైల్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, పవన్ అభిమానుల్ని థ్రిల్ చేసేలా ప్రెజెంట్ చేయడంలో మాస్టర్. గతంలో గబ్బర్ సింగ్లోనూ అసలు వెర్షన్‌లో లేని అనేక మాస్ ఎలిమెంట్స్‌ని జోడించి, సినిమాను మరింత పవర్‌ఫుల్‌గా మలిచాడు. గద్దలకొండ గణేష్లోనూ అదే ఫార్ములా వర్కౌట్ అయ్యింది. కాబట్టి, ఉస్తాద్ భగత్ సింగ్ లొనూ కొత్త మాస్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండబోతున్నాయని చెబుతున్నారు.
అయితే, ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? వచ్చే ఏడాది ఎప్పుడు విడుదల అవుతుంది? అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్‌లో పెద్ద ప్రశ్నగా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిగా బిజీగా ఉండటంతో, సినిమా షూటింగ్ కాస్త నెమ్మదిగా సాగుతోంది. వచ్చే ఏడాది మిడ్‌లోగానీ, 2026 మొదటి త్రైమాసికంలో గానీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి, హరీష్ శంకర్ లేటయినా ఈ ప్రాజెక్ట్‌కి హైప్ తగ్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.