నందమూరి హీరో పై కన్నేసిన హరీష్ శంకర్?
పవన్, హరీష్ కాంబోలో ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ నటించిన ఆ మూవీ.. అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా మారింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమాతో నిరాశపరిచిన హరీష్ శంకర్.. ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
పవన్, హరీష్ కాంబోలో ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కొంత షూటింగ్ పార్ట్ జరగ్గా.. పవన్ రాజకీయాలతో బిజీగా మారడం వల్ల మూవీ హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పవన్ తన టైమ్ చూసుకుని సినిమాలు పూర్తి చేస్తున్నారు. హరిహర వీరమల్లు, ఓజీ కంప్లీట్ అయ్యాక ఉస్తాద్ సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
అయితే రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు టాక్ వినిపించింది. టోటల్ బౌండ్ స్క్రిప్ట్ ఇప్పుడు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, అదే సమయంలో రామ్ పోతినేని కోసం ట్రై చేశాడు. కానీ ఎందుకొ ఆ కాంబో సెట్టవ్వలేదు. ఇక లేటెస్ట్ గా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కోసం హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు కూడా సమాచారం.
ఎప్పటి నుంచో బాలకృష్ణ, హరీష్ శంకర్ కాంబోలో మూవీ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ.. భారీగా ప్రొడ్యూస్ చేయనుందని తొలుత టాక్ వినిపించింది. ఆ తర్వాత గతేడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మలయాళం మూవీ ఆవేశం రీమేక్ ను బాలయ్యతో హరీష్ చేస్తారని ప్రచారం జరిగింది.
ఆవేశంలో ఫహాద్ ఫాజిల్ చేసిన క్యారెక్టర్ ను తెలుగులో చేయగలిగే హీరో బాలకృష్ణ మాత్రమేనని అభిప్రాయాలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించాయి. హరీష్ శంకర్ సరైన విధంగా డైరెక్ట్ చేయగలరని అంతా అన్నారు. కానీ దానిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇప్పుడు మాత్రం హరీష్ ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఆ సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యారట. ఇటీవల చర్చలు కూడా జరిగాయని సమాచారం. హరీష్ తన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యాక.. బాలయ్యకు స్టోరీ మొత్తం నెరేట్ చేయనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత అధికారిక ప్రకటన రానుందని వినికిడి. మరి బాలయ్య, హరీష్ కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.