హరీష్ శంకర్ మాటల మర్మం.. నిజంగా ఇది ఆడియెన్స్ తప్పేనా?

హరీష్ శంకర్ మాట్లాడుతూ, "తెలుగు ప్రేక్షకులు మిగిలిన అన్ని భాషల సినిమాలను చూస్తారు కానీ మన తెలుగు సినిమాలను మాత్రం అలా ఆదరించరేమో", అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Update: 2025-02-17 16:27 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమధ్య సినిమాల కంటే ఈవెంట్స్ కు సంబంధించిన అంశాలే బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా అదే కోవలో నిలిచారు. తన స్పష్టమైన మాటలు, పదునైన వ్యాఖ్యలతో ఎప్పుడూ సంచలనమే సృష్టించే హరీష్, తాజాగా ప్రదీప్ రంగనాథన్‌ హీరోగా నటించిన డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆయన చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయా? లేక నిజంగానే తెలుగులో సినిమాలకు ఓ ఛాలెంజ్ ఉందా? అనే చర్చ అందరిలోనూ మొదలైంది.

హరీష్ శంకర్ మాట్లాడుతూ, "తెలుగు ప్రేక్షకులు మిగిలిన అన్ని భాషల సినిమాలను చూస్తారు కానీ మన తెలుగు సినిమాలను మాత్రం అలా ఆదరించరేమో", అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మాటల్లో ఒక అర్థం దాగుంది. తెలుగు సినిమాలు కంటే ఇతర భాషా సినిమాలకు ఇక్కడ భారీగా ఆదరణ లభిస్తున్నదని, మన ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో టాలెంట్‌కు న్యాయం జరగాలని ఆయన గట్టిగా సూచించారు.

ప్రస్తుతం తెలుగు సినిమాలు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. ఆడియన్స్ వేరే భాషా చిత్రాలకు ఎక్కువగా మొగ్గు చూపుతుండటంతో మన స్వంత సినిమాల వసూళ్లు సవాల్‌గా మారుతున్నాయి. తమిళ, మలయాళ చిత్రాలు ఎక్కువగా థియేటర్లలో రన్ అవుతున్నాయి. ఇదే అంశాన్ని హరీష్ శంకర్ హైలైట్ చేస్తూ, తెలుగు సినిమాలకు టిక్కెట్ కౌంటర్ల వద్ద సపోర్ట్ అవసరమని చెప్పినట్లు అర్థమవుతోంది.

మరోవైపు హరీష్ చేసిన కామెంట్స్ కు కౌంటర్లు కూడా పడుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడొచ్చినా హిట్స్ అవుతాయని అంటున్నారు. ఈమధ్య వచ్చిన తండేల్ సినిమా 100 కోట్లు అందుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అలాగే మిస్టర్ బచ్చన్ లాంటి రోటీన్ సినిమాలకు ఎలా ఆదరిస్తారని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు.

ఇక, మరోవైపు నిర్మాత ఎస్ కే ఎన్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. "తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. అందుకే నేను, మా డైరెక్టర్ సాయి రాజేశ్ తెలుగులో ఇతర భాషా హీరోయిన్లను మాత్రమే ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నాం," అని ఆయన వేదికపై పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు నేరుగా బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించేలా కనిపించాయి.

వైష్ణవి చైతన్య బేబీ చిత్రం తర్వాత మరో సినిమాకు ఎస్ కే ఎన్ టీమ్‌తో పనిచేయలేదు. ఈ నేపథ్యంలోని ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. తెలుగు హీరోయిన్లు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు, ఒక నిర్మాత ఇలా మాట్లాడటం నిజంగా ఆలోచనీయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వివాదంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. హరీష్ శంకర్ వ్యాఖ్యలు తెలుగు సినిమాకు మద్దతుగా ఉన్నప్పటికీ, ఎస్ కే ఎన్ మాటలు మాత్రం తెలుగు నటీమణుల పరిస్థితిపై చర్చ రేకెత్తిస్తున్నాయి. మొత్తానికి, ఈ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివాదాలు మాత్రం మున్ముందు మరింత హాట్ టాపిక్‌గా మారడం ఖాయం.

Tags:    

Similar News