రచయితగా ఎంత పనిమంతుడైనా కానీ..!
రచయితగా అతడి టెక్నిక్ కి పరిశ్రమ ఆశ్చర్యపోయింది. బూతు కామెడీలు ఏల్తున్న రోజుల్లో కూడా అమృతం లాంటి క్లాసిక్ కామెడీ సిరీస్ తో ఆకట్టుకున్న రచయిత అతడు.
రచయితగా అతడి టెక్నిక్ కి పరిశ్రమ ఆశ్చర్యపోయింది. బూతు కామెడీలు ఏల్తున్న రోజుల్లో కూడా అమృతం లాంటి క్లాసిక్ కామెడీ సిరీస్ తో ఆకట్టుకున్న రచయిత అతడు. టీవీ సినిమా రంగంలో దశాబ్దాల పాటు అనుభవం ఉన్న అతడు రచయితగా ఉద్ధండుడు. అమృతం సీరియల్ నటుడిగా, రచయితగా, దర్శకుడిగాను (కొన్ని ఎపిసోడ్లకు) హర్ష మెప్పించాడు. కళారంగంలో హర్ష ప్రయాణం ఆసక్తికరం. అతడు టాలీవుడ్ నటుడిగానే కాకుండా, రచయితగా సత్తా చాటాడు. ఇక అందరు దర్శకుల్లానే తాను కూడా దర్శకుడిగా ఎదగాలని ప్రయత్నించాడు. అమృతం -రుతు రాగాలు వంటి టీవీ సీరియల్స్‌లో తన పాత్రలతో మెప్పించిన హర్ష.. 30 కి పైగా తెలుగు చిత్రాలు చేసాడు. తెలుగు చిత్రం గుండె జారి గల్లంతయ్యిందే - అక్కినేని 'మనం'తో రచయితగా మారాడు.
ఆరంభం టీవీ సీరియల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతని మొదటి సీరియల్ రుతురాగాలు. ఇది దూరదర్శన్‌లో పెద్ద హిట్ డైలీ సీరియల్. ఆ తర్వాత అతనికి సీరియల్స్‌లో చాలా ఆఫర్లు వచ్చాయి. కస్తూరి అనే సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. కస్తూరి సీరియల్‌లో తన పాత్రకు చాలా ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత అమృతం సీరియల్ చేశాడు. ఇది తెలుగులో చాలా పాపులర్ కామెడీ సీరియల్. ఎన్నో అవార్డులు అందుకున్నాడు. టీవీ నుంచి మారి సినిమాల్లో నటిస్తున్నాడు. అతని మొదటి చిత్రం కొండవీటి సింహాసనం. కానీ అతను అనుకోకుండా ఒకరోజు, లీడర్, జోష్ మొదలైన చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. హర్ష విభిన్నమైన టైమింగ్ తో ఆకట్టుకునే హాస్యనటుడు. ఇక తన స్క్రిప్ట్ రైటింగ్ విషయానికి వస్తే, సినిమాల్లో పనిచేసేటప్పుడు డైలాగులకు సజెషన్స్ ఇచ్చేవాడు. అలా మెల్లగా రైటర్‌గా మారాడు.
ద్రోణ, ఇష్క్, విశాఖ ఎక్స్‌ప్రెస్, గుండె జారి గల్లంతైందే, మనం వంటి చిత్రాలకు కలం పట్టాడు. ఆయనకు లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ అంటే ఇష్టం. హీరో నితిన్ సినిమాలకు రైటర్‌గా పనిచేసాడు. అప్పట్లోనే 'ఊహలు గుసగుసలాడే' సినిమాకి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేశాడు. ఇది సూపర్ విజయాన్ని సాధించింది. రచయితగా అతడి ఇమేజ్ చాలా గొప్పది. అటుపై డైరెక్షన్‌లో అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే నితిన్ - నాగార్జునల నుండి అతనికి ఆఫర్లు వచ్చాయని ప్రచారమైంది కానీ దర్శకుడిగా ఆరంభ కష్టాలు అతడికి ఎదురయ్యాయి. అందరు రచయితల్లానే హర్ష కూడా దర్శకుడిగా ఎదగాలని కలలుగన్నా అది సులువు కాదని అర్థమైంది. అయినా ప్రయత్నాలు ఆపలేదు.
చాలా కాలం క్రితం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే సినిమా తెరకెక్కించినా రిలీజ్ ఆలస్యం అయింది. దీంతో ఆ తర్వాత గూగ్లీ అని క్యాచీ టైటిల్ కి మార్చినా కానీ అది ఎందుకనో రిలీజైన దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు చాలా కాలానికి సుధీర్ బాబు హీరోగా అతడు స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన మామా మశ్చీంద్ర విడుదలైంది. సుధీర్ బాబు ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడని తెలియడంతో ఆసక్తి కలిగింది. హర్ష ఈ చిత్రానికి రైటర్ గా దర్శకుడిగా మ్యాజిక్ చేస్తున్నాడనే ఫస్ట్ గ్లింప్స్ చూశాక అంతా భావించారు. కానీ ఈ సినిమా విడుదల కూడా రకరకాల కారణాలతో ఆలస్యమవ్వడంతో సినిమాపై ఆరంభం ఉన్న క్యూరియాసిటీ తగ్గిపోయింది. ఈ అక్టోబర్ 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా మిగిలింది. కథ ఎత్తుగడ బావున్నా కానీ, అతడు కథనాన్ని తీవ్ర గందరగోళంతో తీర్చిదిద్దడంతో అది కాస్తా మిస్ ఫైరైంది. పాత్రల తీరుతెన్నులు కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దర్శకుడిగా హర్ష నుంచి ఏదైనా ప్రత్యేకత కనిపిస్తుందని భావించిన వారికి తీవ్ర నిరాశే మిగిలింది. రైటర్ గా ఎంత పెద్ద సక్సెసైనా కానీ, దర్శకుడిగా మాత్రం అతడు పూర్తిగా తేలిపోయాడని విమర్శలొస్తున్నాయి.
సంగీత దర్శకుడు కావాలనుకుని..!
నిజానికి హర్షవర్ధన్ కెరీర్ కొంత గజిబిజి వ్యవహారం అని తనకు తానుగానే అంగీకరిస్తాడు. అతడు నటుడు, దర్శకరచయిత అని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ అతడి గురించి అంతగా తెలియని అంశం.. హర్ష మంచి గాయకుడు కూడా. ఎప్పుడో ఒకప్పుడు సంగీత దర్శకుడవ్వాలని ఆకాంక్షించారు. తాను చాలా గందరగోళంగా ఉన్న వ్యక్తిని అని కూడా ఒకానొక సందర్భంలో హర్ష అంగీకరించాడు. చల్ చల్, దళం, లవ్లీ, SMS, ప్లే, గగనం, గాయం 2, పౌర్ణమి, అతడు, అయితే, అనుకోకుండా ఒక రోజు ఇలా చాలా చిత్రాలలో అతడు పని చేసాడు.
హర్ష వర్ధన్ కు 18 సంవత్సరాల నటనానుభవం ఉంది. చాలాకాలం క్రితం హర్షవర్ధన్ డైలాగ్ రైటర్‌గా మారాడు. వాస్తవానికి అతడు సంగీతకారుడు కావడానికి పరిశ్రమలోకి వచ్చాడు. అతని ప్రేరణ సంగీత దర్శకుడు ఇళయరాజా. హర్షవర్ధన్ సంగీతంలో శిక్షణ పొందలేదు కానీ అతను వాయిద్యాలు వాయిస్తాడు. అతడు తన స్వంత ట్యూన్‌లను కంపోజ్ చేయగలడు. ఆలు-బాలు, అమృతం మొదలైన అనేక సీరియల్స్‌కి నేపథ్య సంగీతం అందించాడు. అతను సంగీత దర్శకుడు కావాలనుకున్నాడు.. కానీ విధి అతన్ని నటుడిగా రచయితగా మార్చింది. ఇంతలోనే దర్శకుడిగా ప్రయత్నించి ఆరంభ కష్టాలను ఎదుర్కొంటున్నాడు.