మరి తెలుగు పరిశ్రమ అందుకు ముందుకొస్తుందా?
జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమ సహా దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమ సహా దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. అయితే ఇలాంటి కమిటీ మాకు కావాలంటూ కన్నడ సినీ పరిశ్రమలోనూ అవసరమని ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్వీటి (ఫైర్) కోరింది. సుప్రీమ్ కోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో ఇలాంటి కమిటీ వేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ఫైర్ విజ్ఞప్తి చేసింది.
కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కుంటున్న లైంగిక దాడులను, ఇతర సమస్యల నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని దానికి సంబంధించి ప్రభుత్వం ముందుకొచ్చి కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. దానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని 153 మంది సంతకం చేసి అందించారు. అయితే కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొదట ఈ ఆలోచనను స్వాగతించినా తర్వాత అలాంటి కమిటీ అవసరం లేదన్నారు.
అయితే ఇప్పుడిదే అంశం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ హేమ కమిటీలాంటిది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కూడ ఒకటి రావాలి అన్న అంశం తెరపైకి వస్తోంది. ప్రభుత్వం ముందుకొచ్చి ఇలాంటి కమిటీ ఏర్పాటు చేస్తే సినీ పరిశ్రమ పని ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయని, ఇలాంటి కమిటీ ఒకటి ఉంటే? అందరికీ శ్రేయస్కరంగానూ ఉంటుందని, చిత్ర పరిశ్రమపై ఉన్న అపోహలు కూడా తొలగిపోతాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
మరి తెలుగు పరిశ్రమ అందుకు ముందుకొస్తుందా? హేమ కమిటీ లాంటిది తీసుకురాగలదా? అందుకు పరిశ్రమలో అన్ని అసోసియేషన్లు అంగీకరిస్తాయా? కన్నడలో ఫైర్ డిమాండ్ సుదీప్ సహా చాలా మంది స్టార్ హీరోలు అంగీకరించి ముందుకొచ్చారు. తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించారు. మరి అలా తెలుగు నుంచి కూడా స్టార్ హీరోలు ముందుకు వస్తారా? లేదా? ఇలా ఎన్నో అంశాలతో ముడిపడిన అంశం ఇది.
ఇప్పటికే నటి సమంత 2019 లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ దీని గురించి ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాధానం రాలేదు. ప్రభుత్వం నుంచి కూడా స్పందన కరువైంది.