టాలీవుడ్‌లో కార్పొరెట్ దివాళాపై యువహీరో హాట్ కామెంట్
అయితే ఒకప్పుడు కార్పొరెట్ కంపెనీలు సినిమాల్ని సక్సెస్ చేయడంలో ఎందుకు విఫలమయ్యాయి? అనేదానికి తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ యువహీరో జవాబిచ్చారు.
మునుపటితో పోలిస్తే టాలీవుడ్ లో సక్సెస్ రేటు పెరిగింది. కంటెంట్ లో క్వాలిటీ పెరగడంతో విజయాల శాతం పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. తెలుగు బ్రాండ్ అంతర్జాతీయంగా మార్మోగుతోంది. దీంతో సినీరంగంలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరెట్లు ముందుకు వస్తున్నాయి. స్థానిక బ్యానర్లతో టై అప్ లు పెట్టుకుని సినిమాల్ని నిర్మించేందుకు బడా సంస్థలు ఆసక్తిని చూపుతున్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయి సంస్థలు పాన్ ఇండియా సినిమాల నిర్మాణానికి ఉత్కంఠగా వేచి చూస్తున్నాయి. ఇది నిజానికి తెలుగు చిత్రసీమకు కలిసొచ్చే అంశమే.
కానీ దశాబ్ధం క్రితం కూడా కొన్ని కార్పొరెట్ కంపెనీలు ఇలాంటి ప్రయత్నం చేసాయి. కానీ ఆశించిన విజయాలు సాధించడంలోనే చతికిలబడ్డాయి. ఇందులో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, డిస్నీ ప్లస్, స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి కార్పొరెట్లు తెలుగు సినీపరిశ్రమలో భారీ పెట్టుబడుల్ని పెట్టాయి. ఇక్కడ అగ్ర హీరోలతో పలు భారీ చిత్రాలను నిర్మించాయి. కానీ ఎందుకనో ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాపులుగా నిలిచాయి. అనంతర కాలంలో కార్పొరెట్ కంపెనీలు తెలుగు పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి తగ్గాయి.
కానీ కాలంతో పాటే మార్పు. ఇప్పుడు సక్సెస్ మన వెంటే ఉంది. అందువల్ల తిరిగి కార్పొరెట్ ఆలోచనలు మార్చుకుని ఇక్కడ హీరోలు, దర్శకనిర్మాతలతో టై అప్ లు పెట్టుకుని సినిమాల నిర్మాణానికి ముందుకొస్తున్నాయి. అయితే ఒకప్పుడు కార్పొరెట్ కంపెనీలు సినిమాల్ని సక్సెస్ చేయడంలో ఎందుకు విఫలమయ్యాయి? అనేదానికి తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ యువహీరో జవాబిచ్చారు.
పాపులర్ మీడియాతో ముచ్చటిస్తూ.. కార్పొరెట్లు మన నేటివిటీకి వచ్చినప్పుడు ఇక్కడ కింది స్థాయిలో విషయాలను అర్థం చేసుకుని, తాము కిందికి దిగి వచ్చి పని చేయాల్సి ఉంటుంది. కానీ అప్పట్లో అలా లేదు. వారు గీసిన గీతను దాటకూడదనే ధోరణి ఉండేది. ప్రతిదీ ఒక సెటప్ ఉంటుంది. ఆ సెటప్‌లోనే వెళ్లిపోవాలని భీష్మించుకుని ఉంటారు. దీంతో ప్రొడక్షన్ టీమ్ కి చాలా చిక్కులు ఎదురవుతుంటాయి. సౌకర్యాల కల్పనకు కూడా ఇది ఆటంకంగా ఉంటుంది. అలాగే చిత్రకథానాయకుడితో పూర్తిగా మింగిల్ అయ్యి పని చేస్తేనే సినిమాకు అది ప్లస్ అవుతుంది కానీ, కార్పొరెట్ తమ పంథాలో ఉంటే అది విజయవంతం కాదు. అప్పట్లో అలాంటి చిక్కులొచ్చాయి గనుకే ఫెయిల్యూర్ ఎదురైందని విశ్లేషించారు. ఇప్పుడు తాను సోని వంటి బడా కార్పొరెట్ సంస్థలతో కలిసి పని చేస్తున్నానని, అయితే వీళ్లతో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని, తమ మధ్య మంచి ర్యాపో ఉందని కూడా వెల్లడించారు. కార్పొరెట్లు కింది స్థాయిలో ప్రొడక్షన్ అవసరాలేమిటన్నది తెలుసుకుని సహకారం, సమన్వయంతో ముందుకు సాగితేనే సక్సెస్ దక్కుతుందని కూడా విశ్లేషించారు. ఇటీవల కార్పొరెట్లు పంథా మార్చుకున్నాయని కూడా వెల్లడించారు.