హే తారా.. మ్యాజికల్ టచ్‌తో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మెలోడీ
ప్రత్యేకంగా రూపొందించిన "హే తారా" మెలోడీ సాంగ్ విడుదలైంది. కార్తీక్ అందించిన సంగీతం మరోసారి అందరినీ మాయ చేసింది.
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా స్వయంభూ సినిమా భారీ బడ్జెట్ తో రెడీ అవుతోంది. ఇక దానికంటే ముందు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న మరో డిఫరెంట్ ఎంటర్‌టైనర్ రానుంది. గతంలో ‘స్వామి రారా’ మరియు ‘కేశవ’ లాంటి సినిమాలతో ఈ కాంబినేషన్ మంచి హిట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబోలో వస్తున్న 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రం పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి సంస్థ బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఆమెతో పాటు, దివ్యాంశ కౌశిక్ మరియు హర్ష చెముడు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అయింది.
అయితే ఈ రోజు నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ప్రత్యేకంగా రూపొందించిన "హే తారా" మెలోడీ సాంగ్ విడుదలైంది. కార్తీక్ అందించిన సంగీతం మరోసారి అందరినీ మాయ చేసింది. కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం, ప్రేమికుల మధ్య సున్నితమైన భావాలను వ్యక్తీకరిస్తూ, ప్రేమలో ఉన్న అనుభూతులను మరింత మధురంగా మార్చింది.
కార్తీక్ మరియు నిత్యశ్రీల గొంతుతో మరింత అందంగా మారిన ఈ పాట ఇప్పటికే శ్రోతలను కట్టిపడేస్తోంది. నిఖిల్, రుక్మిణి వసంత్ ఈ సినిమాలో తొలిసారి జంటగా కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా ఆకట్టుకుంటోంది. వారి మధ్య ప్రేమా, అనుబంధాలను అద్భుతంగా చూపించే ఈ పాట, ప్రేక్షకులకు మరోసారి మ్యూజికల్ ఎక్స్ పీరియెన్స్‌ను అందించింది.
అన్నింటికి మించి, కార్తీక్ కంపోజ్ చేసిన ఈ పాటకు సంబంధించిన మ్యూజిక్ ఆడియో ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. లిరిక్స్‌లో ఉండే భావోద్వేగాలు, సంగీతంలో వినిపించే మాధుర్యం ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాట సినిమాకు ఓ ప్రత్యేకమైన అద్దం లాంటిదని చెప్పొచ్చు.
సినిమా బాక్సాఫీస్ పై భారీ విజయాన్ని అందుకుంటుందనే అంచనాలు ఇప్పటికే ఉన్న నేపథ్యంలో, కార్తీక్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో పెద్ద ప్లస్ అవుతుందనే నమ్మకం అందరిలో ఉంది. ఈ సినిమా నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. బాపినీడు బి సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు కార్తీక్ సంగీతం అందించగా, సన్నీ ఎమ్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు.