కోవిడ్ తర్వాత 'పుష్ప 2'కే సింహాసనం
కరోనా వైరస్ ప్రజాజీవనాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తో లక్షల కోట్ల నష్టం మిగిలింది.;
కరోనా వైరస్ ప్రజాజీవనాన్ని అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తో లక్షల కోట్ల నష్టం మిగిలింది. ఆ కష్ట సమయంలో జనం థియటర్లకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో సినీపరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి. వినోద పరిశ్రమ అతలాకుతలం అయింది. కోవిడ్ విలయం తర్వాత పరిశ్రమలు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే కష్టకాలం తర్వాత భారతీయ సినీపరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద హవా సాగించిన టాప్ 10 టికెట్ సెల్లర్స్ గురించి వివరాలు ఆరా తీస్తే ఆసక్తికర సంగతులు తెలిసాయి.
కోవిడ్ అనంతర కాలంలో టికెట్ల అమ్మకాల్లో టాప్ 10 సినిమాల జాబితాను పరిశీలిస్తే... అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` నంబర్ 1 స్థానంలో సింహాసనాన్ని అధిష్టించింది. ఇటీవలే విడుదలైన `చావా` 10వ స్థానంలో నిలిచింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహించిన `పుష్ప 2: ది రూల్` భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 5 డిసెంబర్ 2024న విడుదలైన ఈ మాస్ యాక్షన్ డ్రామా అప్పటివరకూ స్థిరంగా ఉన్న `బాహుబలి 2` రికార్డును అధిగమించి ఈ ఘనతను సాధించింది. పుష్ప 2 చిత్రం RRR, KGF 2 , జవాన్ చిత్రాలను అధిగమించి అత్యధిక వసూళ్లను సాధించింది. 2024 లోనే కాదు, ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ గా రికార్డులకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 6.30 కోట్ల నుండి 6.50 కోట్ల టిక్కెట్ల అమ్మకాలను సాధించింది.
టికెట్ సేల్ పరంగా టాప్ 10 సినిమాల జాబితాను పరిశీలిస్తే... 14 ఫిబ్రవరి 2025న విడుదలైన విక్కీ కౌశల్ `చావా` నాలుగు వారాలకు పైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇప్పటికి 2.75 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ లెక్కల్లో మరింత పురోగతిని సాధిస్తుందని అంచనా.
టాప్-10 జాబితాను పరిశీలిస్తే `పుష్ప 2` నంబర్ వన్ స్థానంలో చేరగా, చావా 10వ స్థానాన్ని దక్కించుకుంది. బెస్ట్ టికెట్ సేల్ పరంగా జాబితా పరిశీలిస్తే....
1 పుష్ప 2: ది రూల్ 6.30 కోట్లు-6.50 కోట్లు (టికెట్లు)
2 కెజిఎఫ్ చాప్టర్ 2 5.10 కోట్లు
3 ఆర్ఆర్ఆర్ 4.50 కోట్లు
4 జవాన్ 3.80 కోట్లు
5 కల్కి 2898 ఎడి 3.60 కోట్లు
6 పఠాన్ 3.45 కోట్లు
7 గదర్ 2: ది కథ కంటిన్యూస్ 3.40 కోట్లు
8 స్త్రీ 2 3.20 కోట్లు
9 యానిమల్ 3 కోట్లు
10 చావా 2.75 కోట్లు+ (... ఇంకా లెక్కింపు సాగుతోంది)
సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ ఈ నెల ఈద్ సందర్భంగా విడుదలవుతోంది. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రం ఈ జాబితాలో చేరుతుందా లేదా వేచి చూడాలి. జాబితాలో చేరాలంటే సికందర్ కనీసం 2.75 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టికెట్లను అమ్మాల్సి ఉంటుంది.