66 వయసులో హృతిక్ రోషన్ తల్లి జిమ్‌లో కసరత్తులు చూశారా?
హృతిక్ ని మించి అతడి తల్లిగారు పింకీ రోషన్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారనేది కొద్దిమందికే తెలుసు.
ఫిట్‌నెస్, తీరైన శారీరక ధారుడ్యంతో గ్రీక్ గాడ్‌గా హృదయాలను గెలుచుకున్నారు హృతిక్ రోషన్. నేటితరం జిమ్‌లో కుస్తీలు పట్టడం వెనక అతడు ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. యువకులు అతడిలా మారాలని కలలు కంటారు. దానికోసం నిరంతరం జిమ్‌లో చాలా శ్రమిస్తారు. కానీ అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. హృతిక్ రోజుకు రెండున్నర గంటలు తప్పనిసరిగా జిమ్ లో వ్యాయామాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు. సుశిక్షితుడైన కోచ్ సమక్షంలో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు చాలా ఖర్చు చేస్తూ, జీవితాంతం కష్టపడుతూనే ఉన్నారు.
అయితే హృతిక్ గురించి మాత్రమే మనకు తెలుసు. హృతిక్ ని మించి అతడి తల్లిగారు పింకీ రోషన్ ఫిట్ నెస్ ఫ్రీక్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారనేది కొద్దిమందికే తెలుసు. పింకీ రోషన్ 66 సంవత్సరాల వయస్సులో కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తారు. ఆమె రెగ్యులర్ గా తన వర్కౌట్ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. తనకు 66 ఏళ్లు అంటే నమ్మడం చాలా కష్టం. పింకీ తన ఫిట్‌నెస్‌తో నేటి యువ నటీమణులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాదు.. హృతిక్ కూడా తన తల్లి ఫిట్‌నెస్‌కి అభిమానిగా మారారంటే అర్థం చేసుకోవాలి.
తాజాగా పింకీ రోషన్ తన ఇన్‌స్టా ఖాతాలో కొన్ని వీడియోలను షేర్ చేసారు. తనయుడితో పోటీపడుతూ జిమ్‌లో చెమటోడ్చడమే కాకుండా పింకీ క్రమం తప్పకుండా యోగా చేస్తారు. ఆమె వ్యాయామ దినచర్యలో పరుగు, ఈత కూడా ఉన్నాయి. వర్కవుట్ రొటీన్‌లో పుషప్స్ , కిక్ బాక్సింగ్ వంటి హార్డ్ కోర్ వ్యాయామాలు కూడా ఉన్నాయి. పుషప్స్ తో శరీరంలోని అన్ని కండరాలకు వ్యాయామం జరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కిక్ బాక్సింగ్ తో మోచేతులు, మోకాలు, చేతులు బలంగా మారతాయి. ఇది మీ బ్యాలెన్స్‌ని మెరుగుపరచడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని చాలా బాగా ఉంచుతుందని ఆమె చెబుతుంటారు. ఇప్పటికే 66 ఏళ్ల మామ్ పింకీ కసరత్తుల వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా షేర్ అవుతున్నాయి. తాను కసరత్తులు చేసేప్పుడు క్లాసిక్ డే పాటలను వినడానికి ఆమె ఇష్టపడతారని హృతిక్ తెలిపారు.