మాజీ భార్య ప్రియుడికి స్టార్ హీరో విషెస్

అయితే ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిన వారు స‌ప‌రేట్ అయ్యాక‌, వేరొక భాగ‌స్వామికి చేరువ‌య్యారు.

Update: 2024-12-20 05:42 GMT

ఈ అంద‌మైన జంట స్కూల్ డేస్ నుంచి స్నేహితులు. వ‌య‌సొచ్చాక‌ ప్రేమించుకుని, పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా. పిల్ల‌లు ఇప్ప‌టికే ఎదిగేశారు. రేపో మాపో హీరోలు అవుతారు కూడా. ఇలాంటి వ‌య‌సులో ఈ జంట ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో విడిపోవడం ప‌రిశ్ర‌మ‌తో పాటు అంద‌రికీ షాకిచ్చింది. అయితే ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిన వారు స‌ప‌రేట్ అయ్యాక‌, వేరొక భాగ‌స్వామికి చేరువ‌య్యారు. ఈ క‌థ ఇలా సినిమా క‌థ‌లా సాగుతుంటే, విడిపోయి 10 సంవ‌త్స‌రాలైనా మాజీ స్టార్ క‌పుల్ ఇప్ప‌టికీ త‌మ మ‌ధ్య గొప్ప స్నేహానుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. ఆ ఇద్దరూ పిల్ల‌ల ఆల‌నాపాల‌నా చూసుకోవ‌డంలో ఎలాంటి లోటు రానివ్వ‌రు. మాజీలు ఒక‌రి బ‌ర్త్ డే కి మ‌రొక‌రు విషెస్ చెబుతారు. అంతేకాదు.. వారి కొత్త భాగ‌స్వాముల‌కు కూడా శుభాకాంక్షలు చెబుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. ఇది మోడ్ర‌న్ డే లైఫ్ స్టైల్‌కి అద్దం ప‌డుతుంది.

ఇదంతా ఎవ‌రి గురించి అంటే... హృతిక్ రోషన్ - సుస్సానే ఖాన్ గురించే. ఈ జంట‌ విడాకులు తీసుకున్న 10 సంవత్సరాల తర్వాత కూడా గొప్ప అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు. సహ తల్లిదండ్రులుగా కుమారులు హృదాన్, హ్రేహాన్ ల‌కు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అంతేకాదు.. త‌మ జీవితంలో ప్ర‌వేశించిన కొత్త భాగ‌స్వాముల‌తోను గౌర‌వంగా న‌డుచుకుంటున్నారు. సుసానే ప్ర‌స్తుత ప్రియుడు ఆర్ల్సాన్ గోని పుట్టినరోజు సందర్భంగా తన ఇన్‌స్టాలో రొమాంటిక్ ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేసింది. పార్టీలు, విహారయాత్రల‌లో స‌న్నిహితంగా ఉన్నప్ప‌టి దృశ్యాలివి. జీవితంలో నేను కోరుకునేది నిన్ను మాత్ర‌మే.. నా జాన్! అంటూ ప్రియుడికి బ‌ర్త్ డే విషెస్ చెప్పింది సుసానే. త‌న జీవితంలో సంతోషానికి కార‌కుడు అంటూ పొగిడేసింది.

కామెంట్ సెక్షన్‌లో ఫ్లయింగ్ కిస్, రెడ్ హార్ట్ ఎమోజీలతో సుస్సాన్‌కి ధన్యవాదాలు తెలిపారు ఆర్ల్సాన్ గోని. బ‌ర్త్ డే బోయ్ కి శుభాకాంక్షలు చెబుతూ ప‌లువురు విషెస్ తెల‌ప‌గా, వీరిలో హృతిక్ కూడా ఉన్నారు. ''హ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్'' అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని హృతిక్ షేర్ చేసాడు. సుస్సానే గతంలో హృతిక్ స్నేహితురాలు సబా ఆజాద్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినప్పుడు త‌న ప‌రిణ‌తి ఆక‌ర్షించింది. ఇప్పుడు హృతిక్ రిట‌ర్ లో శుభాకాంక్ష‌లు గిఫ్ట్ గా ఇచ్చాడు. వాస్త‌వానికి ఈ రెండు జంట‌లు చాలా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాయి. జీవితంలో అన్నిర‌కాల స‌రిగ‌మ‌ల్ని ఎలాంటి భేష‌జం లేకుండా ఆస్వాధిస్తున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. హృతిక్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో క‌లిసి స్పై థ్రిల్లర్ 'వార్ 2'లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న‌ YRF స్పై యూనివర్స్‌లో ఒక భాగం. 'కహోనా ప్యార్ హై'(2000)తో బంప‌ర్ హిట్ కొట్టిన హృతిక్ ఆ మ‌రుస‌టి సంవ‌త్స‌ర‌మే సుస్సాన్ ని పెళ్లాడాడు. కొన్నేళ్ల కాపురం త‌ర్వాత సుస్సాన్నే అత‌డి నుంచి విడిపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 2014లో ఇద్దరూ విడిపోయారు.

Tags:    

Similar News