సంధ్య థియేటర్ ఘటన... ఎన్.హెచ్.ఆర్.సీ. ఎంట్రీతో తీవ్ర ఉత్కంఠ!

పుష్ప-2 సినిమాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ) కు ఫిర్యాదు అందింది.

Update: 2024-12-06 09:43 GMT

అల్లు అర్జున్ నటించిన "పుష్ప-2" సినిమా చూసేందుకు కుటుంబంతో పాటు వచ్చిన ఓ మహిళ తొక్కిసలాటలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడి పరిస్థితి ఇంకా విషమంగా ఉందని అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది!

ఈ వ్యవహారంపై స్పందించిన సెంట్రల్ జోన్ డీసీపీ... కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా... బాధితుల ఫిర్యాదు మేరకు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, అతని భద్రతా సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరోపక్క ఈ వ్యవహారంపై తెలంగాణ సర్కార్ కూడా స్ట్రాంగ్ గా స్పందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా... ఈ ఘటనపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. థియేటర్ వద్ద జరిగిన సంఘటన బాధ కలిగించిందని అన్నారు. రేవతి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ సమయంలో... జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది!

అవును... పుష్ప-2 సినిమాపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ) కు ఫిర్యాదు అందింది. ఇందులో భాగంగా... సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదే సమయంలో... అలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు. దీనికి తోడు.. చిక్కడపల్లి పోలీసులు అత్యుత్సాహంతో లాఠీ ఛార్జ్ చేయడం.. ముందస్తు జాగ్రత్తలేవీ తీసుకోకపోవడంతోనే మహిళ మృతి చెందినట్లు పిటిషనర్ ఆరోపించారు.దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే... ఈ పిటిషన్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ) స్పందించింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. దీనిపై దర్యాప్తు జరపనుంది. దీంతో... ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News