నెట్ ఫ్లిక్స్ సిరీస్.. హిందువులు ఉగ్రవాదులా?
తీవ్రవాదులు ప్రమాదకర కుట్రలకు తెర తీసి భారతావనిని అల్లకల్లోలం చేయాలని కుట్ర పన్నారు.
భారతదేశ చరిత్రలో కాందహార్ హైజాక్ ఒక సంచలనం. ప్రయాణీకుల విమానాన్ని హైజాక్ చేసి బెదిరింపులకు పాల్పడటమే గాక, ప్రమాదకర ముష్కరులను భారత ప్రభుత్వం నుంచి విడిపించుకున్న ఘటనను ఎవరూ మర్చిపోలేరు. IC-814 విమానం హైజాకింగ్‌లో పాల్గొన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. కాందహార్ లో ల్యాండ్ అయ్యే లోపు పలు చోట్ల ఈ విమానాన్ని దించారు. ప్రయాణీకులను చిత్రవధకు గురి చేసారు. విమాన హైజాక్ లో పాల్గొన్న ఉగ్రవాదుల డిమాండ్ మేరకు మసూద్ అజార్, ఒమర్ షేక్, ముష్తాక్ జార్గర్ వంటి ప్రమాదకరమైన తీవ్రవాదులను విడుదల చేయడానికి దారితీసింది. ఈ ఉగ్రవాదులు తర్వాత పలు సందర్భాల్లో భారత్ పై దాడులు నిర్వహించారు. 2001 పార్లమెంట్ దాడి.. 2008 ముంబై దాడి సహా భారతదేశంలో జరిగిన పెద్ద దాడులకు ఈ ముష్కరులు కారకులు. తీవ్రవాదులు ప్రమాదకర కుట్రలకు తెర తీసి భారతావనిని అల్లకల్లోలం చేయాలని కుట్ర పన్నారు.
ఇప్పుడు అలాంటి కీలకమైన కథాంశాన్ని ఎంచుకుని నెట్ ఫ్లిక్స్ సాహసోపేతంగా వెబ్ సిరీస్ ని తెరకెక్కించింది. అనుభవ్ సిన్హా దీనికి దర్శకత్వం వహించారు. `IC 814- ది కాందహార్ హైజాక్` అనేది సిరీస్ టైటిల్. ఈ సిరీస్ ఆద్యంతం రక్తి కట్టించే కథాంశం, గ్రిప్పింగ్ డ్రామాతో వీక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఇందులో నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, విజయ్ వర్మ, అరవింద్ స్వామి లాంటి అగ్ర తారాగణం కథను రక్తి కట్టించారు. నటీనటుల అద్భుత ప్రదర్శన, దర్శకుని పనితనంతో ఈ సిరీస్ కి ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. నటీనటులంతా తమ పాత్రలకు జీవం పోసారని ప్రశంసలు దక్కాయి.
అయితే 1999 హైజాకింగ్ సంఘటనను చిత్రీకరించిన మేకర్స్ కొన్ని తప్పులు చేసారని కూడా గుర్తించారు. ఇందులో హిందువులను లక్ష్యంగా చేసుకున్నారని, సిరీస్‌ను బహిష్కరించాలని హిందూవాదులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే దీనికి కారణం ఏమై ఉంటుంది? అంటే హైజాకర్ల పేర్లు మార్చేసారు. నిజానికి ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్, సన్నీ అహ్మద్, జహూర్ మిస్త్రీ , షకీర్ అనేవి వారి పేర్లు. కానీ ఈ సిరీస్‌లో శంకర్, భోలా అనే పేర్లను ఉపయోగించారు. ఇది హిందువులను ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నమే. దీంతో ఈ వ్యవహారాన్ని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ విమర్శిస్తున్నారు. మేకర్స్‌పై చర్య తీసుకోవాలని, నెట్‌ఫ్లిక్స్‌పై పెద్ద జరిమానా విధించాలని నెటిజనులు కోరుతున్నారు.
అసలు ఉగ్రవాదుల పేర్లను ఎందుకు మార్చాల్సి వచ్చిందని కూడా కొందరు నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. దర్శకుడు అనుభవ్ సిన్హా ఉగ్రవాదానికి మతం లేదు చెప్పదలిచినా కానీ ఒరిజినల్ ఘటనలోని వారి పేర్లను ఎందుకు మార్చాలని నిర్ణయించుకున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.
సిరీస్ లో రాజకీయాలు:
ఈ సిరీస్ 1999 ఘటనలో ప్రభుత్వం వివాదాస్పద చర్యలను హైలైట్ చేసింది. ముఖ్యంగా అజిత్ దోవల్ ఆధ్వర్యంలోని ఎన్.ఎస్.ఏ చర్యల వెనక రాజకీయ కారణాలను ఇది బహిర్గతం చేసింది. భారత్‌లో పలు ఉగ్రదాడులతో సంబంధం ఉన్న హఫీజ్ సయీద్ విడుదల సహా ప్రభుత్వం తీసుకున్న పిరికిపంద నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్రవాదాన్ని మరింత పెంచి పోషించడంలో కీలక పాత్ర పోషించాయని సిరీస్ వివరించింది. ప్రభుత్వ అలసత్వ పాలన కారణంగా విమానం పంజాబ్‌ను ఎలా విడిచిపెట్టడానికి అనుమతి లభించిందో ఈ వెబ్ సిరీస్ హైలైట్ చేసింది. రాజకీయ కుట్రల్లో భాగంగా చీఫ్ పైలట్‌పైకి నిందలు ఎలా మరలాయో కూడా చూపించారు. ఇవన్నీ ఇప్పుడు వివాదాస్పద అంశాలుగా మారాయి.