ఫ్యామిలీతో సినిమా చూస్తుంటే థియేట‌ర్‌పై బాంబ్!

అయితే ఈ సంఘ‌ట‌న స్వ‌దేశంలో కాదు.. కెనడాలో జ‌రిగింది. అక్క‌డ మ‌న సౌత్ సినిమాలు ఆడిస్తున్న థియేట‌ర్ పై ఫైర్ బాంబ్ లు విసిరారు దుండ‌గులు.

Update: 2024-11-07 11:58 GMT

కుళ్లు కుతంత్రం కుట్ర పేరాశ లేదా ఇంకేదైనా అనండి.. ఈ సంఘ‌ట‌న మాత్రం భార‌తీయుల‌పై విదేశీయుల దాష్ఠీకానికి అద్దం ప‌డుతోంది. తీరిక స‌మ‌యం దొరికింద‌ని మీరు మీ కుటుంబంతో థియేట‌ర్ కి సినిమా చూడ‌టానికి వెళ్లారు. భార్య పిల్ల‌ల‌తో క‌లిసి సినిమాలో లీన‌మైపోయారు. ఇంత‌లోనే ఎక్క‌డి నుంచో ఫైర్ బాంబ్ థియేట‌ర్ లోకి వ‌చ్చి ప‌డింది. పొగ వ‌దులుతూ పేలింది. ఆ స‌మ‌యంలో మీరైతే ఏం చేస్తారు? కుటుంబంతో పారిపోతారా? ఎక్క‌డికి పారిపోగ‌ల‌రు?

ఊహించుకుంటేనే ద‌డ పుడుతోంది క‌దా! అయితే ఈ సంఘ‌ట‌న స్వ‌దేశంలో కాదు.. కెనడాలో జ‌రిగింది. అక్క‌డ మ‌న సౌత్ సినిమాలు ఆడిస్తున్న థియేట‌ర్ పై ఫైర్ బాంబ్ లు విసిరారు దుండ‌గులు. వారాంతంలో రిచ్‌మండ్ హిల్‌లోని ఒక సినిమా హాల్ పై ఇద్దరు ముసుగు వ్యక్తులు దాడులు జరిపారు. లాబీలో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ, మంటలు త్వరగా ఆరిపోయాయి.. కానీ ఇలా ఎందుకు చేసారో స్పష్టత‌ లేదు. నిజానికి కొంద‌రు స్థానికులు (కెన‌డియ‌న్లు) దక్షిణ భారతీయ చిత్రాలను ప్రదర్శించకుండా థియేటర్లను నిరోధించాలని నిశ్చయించుకున్నారు. ఇలా కావాల‌నే హింస‌ను ప్రేరేపించి రెచ్చ‌గొట్టారు. ఈ దాడి వెనుక లోతైన ఉద్దేశం ఉందని స్పష్టమవుతోంది. ఆ థియేటర్‌లో సౌతిండియ‌న్ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ సినిమా ఆడుతున్న కెన‌డాలోని ఇత‌ర ప్రాంతాల‌ థియేట‌ర్ల‌పై అప్ప‌టికే దాడులు జ‌రిగాయి. మ‌న సినిమాని ఆడ‌నివ్వ‌కూడ‌ద‌నే కుట్రలో భాగం అది అని అర్థ‌మైంది.

ద‌క్షిణ భార‌త సినిమాలు ఆడే థియేట‌ర్ల‌పైనే క‌క్ష ఎందుకు? అంటే.. ఇతర థియేటర్ల లాభాలను దెబ్బతీస్తున్నాయని ఒక వ‌ర్గం న‌మ్మ‌డ‌మే దీనికి కార‌ణం. కెన‌డాలో స్థిర‌ప‌డిన చాలామంది భార‌తీయుల‌కు మ‌న సినిమా కేవ‌లం వినోదం మాత్ర‌మే కాదు.. సాంస్కృతిక అనుబంధంగా భావిస్తారు. అందువ‌ల్ల జ‌నాద‌ర‌ణ ఎక్కువ‌గా ఉంటుంది. కానీ ఇది అక్క‌డి స్థానికుల‌కు న‌చ్చ‌దు.

ఏది ఏమైనా దుండ‌గుల చ‌ర్య ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. కుటుంబాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసే చ‌ర్య‌. ఉద్ధేశ‌పూర్వ‌క‌మైన ఫైర్ బాంబింగ్ పై చ‌ర్య‌లను ప‌రిశీలించాలి. దీనివ‌ల్ల భ‌విష్యత్ లో జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూడాల‌ని అనుకోక‌పోతే..! అదృష్ట‌వ‌శాత్తూ ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదు.. కానీ ఇలా ఎందుకు కుళ్లుతో ఉన్నారు? ఎవ‌రికి న‌చ్చిన సినిమాని వారు చూస్తారు క‌దా! ఇప్పుడు భార‌తీయుల సినిమాలు చూసారు. భవిష్య‌త్ లో హాలీవుడ్ సినిమాల‌ను ఆద‌రిస్తారు? అందుకు ధీటుగా కెన‌డియ‌న్ సినిమాలను ఆడించ‌డం అక్క‌డి క్రియేట‌ర్ల బాధ్య‌త కాదంటారా?

Tags:    

Similar News