టాలీవుడ్ పై కుట్ర జరుగుతోందా..?

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఏకకాలంలో మొత్తం 55 బృందాలుగా ఏర్పడి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయడం అన్నది అందరికీ కాస్త ఆశ్చర్యంగా వుంది.

Update: 2025-01-23 15:30 GMT

టాలీవుడ్ లోని పలువురు సినీ నిర్మాతలు, అనుబంధ నిర్మాణ సంస్థలపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వంటి ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లలో ఐటీ సోదాలు నిర్వహించడం గత రెండు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. దీనిపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతున్నారు. సినిమాలకు వందల కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయని పోస్టర్లు రిలీజ్ చేయడంతో దాడులు జరుగుతున్నాయని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం తెలుగు ఇండస్ట్రీలోకి విదేశీ నిధులు వస్తున్నాయని ఐటీ శాఖ అనుమానిస్తోందా? అని సందేహిస్తున్నారు.

వాస్తవానికి సినీ, రాజకీయ ప్రముఖులపై ఐటీ దాడులు జరగడం అనేది కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటివి మనం చాలానే చూసాం. జీఎస్టీ, టీడీఎస్ వచ్చిన తర్వాత తనిఖీలు చేయడం అనేది కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఏకకాలంలో మొత్తం 55 బృందాలుగా ఏర్పడి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయడం అన్నది అందరికీ కాస్త ఆశ్చర్యంగా వుంది. ఒకేసారి రెండు మూడు పెద్ద నిర్మాణ సంస్థలు, మరో మూడు మీడియం ప్రొడక్షన్ హౌసెస్, భారీ బడ్జెట్ సినిమాల ఫైనాన్షియర్స్ పై సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడుల వెనుక ఉద్దేశ్యం వేరే ఉందా? అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

గతంలోనూ సినీ ప్రముఖుల మీద ఐటీ దాడులు జరిగాయి కానీ, ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలపై సోదాలు నిర్వహించలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియన్ సినిమాలో బాలీవుడ్, కోలీవుడ్ తో సహా ఇతర ఇండస్ట్రీలలో ఒక్కసారిగా ఇలాంటి రైడ్స్ చేసినట్లు వినలేదని.. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ మీద ఒకేసారి దాడులు ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం యాక్టీవ్ గా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలపైనే దాడులు చేయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? కావాలనే తెలుగు చిత్ర పరిశ్రమను టార్గెట్ చేస్తున్నారా? అని నెట్టింట కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. మన ఫిలిం మేకర్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో మూవీస్ రూపొందిస్తూ, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతున్నారు. మిగతా ఇండస్ట్రీలు హిట్లు కొట్టడానికి తీవ్రంగా కష్టపడుతుంటే, తెలుగు చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు అంటూ మైల్ స్టోన్ మార్క్ ను సెట్ చేస్తూ ముందుకు సాగుతున్నాయి. టాలీవుడ్ ఈ స్థాయిలో ఎదగడం చూసి, రైడ్స్ పేరుతో రాళ్లు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అనే యాంగిల్ లో సోషల్ మీడియాలో తెలుగు మూవీ లవర్స్ మధ్య డిస్కషన్ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ దిల్ రాజు పైనా దాడులు జరగడంపై సందేహాలు లేవనెత్తుతున్నారు.

మైత్రీ మూవీస్, దిల్ రాజు ప్రొడక్షన్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్.. ఇవన్నీ కూడా టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసెస్. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నాయి. మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ సుకుమార్ కలిసి తీసిన 'పుష్ప 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర 1830 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రీజనల్ మూవీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐటీ రైడ్స్ జరిగి ఉంటాయని, ఇన్కమ్ ట్యాక్స్ రికార్డ్స్ పరిశీలించడంతో కుట్ర కోణం ఉందని భావించడం సరికాదని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News