ఇండియన్ ఇండస్ట్రీలలో ఫస్ట్ 100 కోట్లు రాబట్టిన సినిమాలివే..
కానీ ఈ మార్కును అందుకున్న కొన్ని సినిమాలు ప్రతిభను మాత్రమే కాకుండా, భారతీయ సినిమా పరిణామాన్ని కూడా పెంచాయి.
గత కొంత కాలంగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ అనేలా బిగ్ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. టాక్ బాగుంటే కలెక్షన్లు కూడా వేల కోట్లు దాటుతున్నాయి. అయితే ఒకప్పుడు 100 కోట్ల గ్రాస్ అంటే చాలా గొప్ప. కానీ ఈ మార్కును అందుకున్న కొన్ని సినిమాలు ప్రతిభను మాత్రమే కాకుండా, భారతీయ సినిమా పరిణామాన్ని కూడా పెంచాయి. ఇక బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, కన్నడ పరిశ్రమలో 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి చిత్రాలపై ఓ లుక్కేస్తే..
1. బాలీవుడ్ - డిస్కో డాన్సర్ (1982)
బాలీవుడ్‌లో మొదటిసారి 100 కోట్ల క్లబ్‌కి చేరిన సినిమా డిస్కో డాన్సర్. మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బి.సుభాష్ తెరకెక్కించారు. ఈ చిత్రం మ్యూజికల్ డ్రామాగా రూపొందింది. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ రష్యాలో సైతం ట్రెండ్ అయ్యాయి. డిస్కో డాన్సర్ భారతీయ సినిమాను అంతర్జాతీయంగా పరిచయం చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా విజయంతో మిథున్ డ్యాన్స్ ఐకాన్‌గా మారారు. ఇప్పటికి అందులోని పాటలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల ట్రాక్ మొదలైంది.
2. కోలీవుడ్ - శివాజీ (2007)
తమిళ చిత్ర పరిశ్రమలో 100 కోట్ల క్లబ్‌కి చేరిన తొలి చిత్రం శివాజీ. రజనీకాంత్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టెక్నికల్‌గా, కథనంలో కొత్త పంథాను తీసుకొచ్చింది. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లను సాధించి కోలీవుడ్‌కి కొత్త రికార్డు తీసుకొచ్చింది. రజనీకాంత్ మాస్ క్రేజ్‌కి ఈ సినిమా మరో మైలురాయిగా నిలిచింది. శంకర్ స్టామినా ఏమిటో మరోసారి ఈ సినిమాతో ప్రపంచానికి తెలిసింది.
3. టాలీవుడ్ - మగధీర (2009)
తెలుగు చిత్ర పరిశ్రమలో 100 కోట్ల క్లబ్‌కి చేరిన తొలి చిత్రం మగధీర. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా విజువల్ వండర్‌గా నిలిచింది. వార్ లవ్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌కి గ్లోబల్‌గా గుర్తింపును తెచ్చింది. రామ్‌చరణ్ కెరీర్‌కి కూడా మగధీర బూస్టర్‌గా నిలిచింది. ఇక రాజమౌళికి కూడా మంచి ధైర్యాన్ని ఇచ్చింది. మగధీర అనంతరం టాలీవుడ్ స్థాయి కూడా అమాంతం పెరిగిపోయింది.
4. సాండల్‌వుడ్ - కేజీఎఫ్ (2018)
కన్నడ పరిశ్రమలో తొలిసారిగా 100 కోట్ల మార్క్ అందుకున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం, కేవలం కన్నడలోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా రికార్డులను సృష్టించింది. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, కన్నడ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. యశ్ పాత్రతో పాటు, రవి బస్రూర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రాలన్నీ ఒక్కో పరిశ్రమకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. బాలీవుడ్ నుంచి డిస్కో డాన్సర్, కోలీవుడ్ నుంచి శివాజీ, టాలీవుడ్ నుంచి మగధీర, సాండల్‌వుడ్ నుంచి కేజీఎఫ్ సినిమాలు ఒక్కో పరిశ్రమకు గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విజయాలు భారతీయ సినిమాను కొత్త దిశలో నడిపించాయి. ఈ 100 కోట్ల క్లబ్ విజయాలు భారతీయ సినిమా స్టాండర్డ్స్ పెంచాయని చెప్పవచ్చు. కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయని ఈ సినిమాలు రుజువు చేశాయి. సాంకేతికత, కథా కథనాలు, నిర్మాణ విలువల్లో కూడా భారతీయ సినిమాలు మరింత ముందుకు వెళ్లాయి.