ధనుష్‌తో వివాదం.. నయన్ కు స్టార్ హీరోయిన్ల సపోర్ట్!
ఇక ఈ ఇష్యూలో నయనతారకు తోటి హీరోయిన్ల నుంచి మద్దతు లభించింది.
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ విడుదల నేపథ్యంలో, హీరో ధనుష్ పై నయన్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన జీవితంపై నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్ ఉపయోగించడానికి నిర్మాత ధనుష్ ఎన్వోసీ ఇవ్వకుండా రెండేళ్లు ఇబ్బంది పెట్టాడంటూ మూడు పేజీల బహిరంగ లేఖను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ట్రైలర్లో 3 సెకన్ల వీడియో క్లిప్ వాడినందుకు రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీస్ పంపించాడని, ఇంత దిగజారుతాడని అనుకోలేదందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక్కడే అతడి క్యారక్టర్ ఏంటో తెలిసిపోతోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
గత రెండు రోజులుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ధనుష్ Vs నయనతార వివాదం గురించే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య పాత గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఇద్దరిలో ఎవరిది తప్పు? అసలేం జరిగింది? అంటూ అంతా పలు విధాలుగా ఆలోచిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి, సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నయన్ భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ సైతం ధనుష్‌పై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి కాసేపటికే డిలీట్ చేసాడు. ఇక ఈ ఇష్యూలో నయనతారకు తోటి హీరోయిన్ల నుంచి మద్దతు లభించింది.
నయనతార ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓపెన్ లెటర్ కు కొందరు కథానాయికలు లైక్ కొట్టి సపోర్టుగా నిలిస్తే, మరికొందరు కామెంట్స్ రూపంలో తమ మద్దతు తెలిపారు. ధనుష్‌తో కలిసి పనిచేసిన శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య లక్ష్మి, అనుపమ పరమేశ్వరన్, పార్వతి తిరువోతు, మంజిమా మోహన్, నజ్రియా నజీమ్ వంటి హీరోయిన్లు ఈ పోస్టును లైక్ చేయడం గమనార్హం. సాయి ధన్సిక, ప్రగ్యా మార్టిన్, దియా మీర్జా, శిల్పారావు లాంటి మరికొందరు లైక్ కొట్టి తమ సపోర్ట్ తెలియజేశారు. తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఈ లిస్టులో ఉంది. ఇక బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ సో మచ్ లవ్ నయన్ అంటూ ఆమె పోస్టుపై స్పందించింది.
'మరియాన్' మూవీలో ధనుష్ సరసన నటించిన మలయాళ నటి పార్వతీ తిరువొత్తు.. నయన్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆమె పోస్టుని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. 'కర్ణన్' సినిమా చేసిన గౌరీ జి. కిషన్ కామెంట్ చేస్తూ.. ''మీరు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారని నేను భావిస్తున్నాను. కళాకారులకు, ప్రత్యేకించి హీరోయిన్లకు తమ మేధో సంపత్తిపై హక్కు లేదు. మేము కాంట్రాక్టు లేబర్స్ కి బదులుగా స్టేక్ హోల్డర్స్ గా పనిచేసే వ్యవస్థాగత మార్పును తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను'' అని అభిప్రాయపడింది. ''వెల్ డన్ నయనతార.. సో మచ్ రెస్పెక్ట్'' అని 'గుండెజారి గల్లంతయ్యిందే' హీరోయిన్ ఇషా తల్వార్ కామెంట్ చేసింది.
ఇలా ధనుష్ తో కలిసి సినిమాలు చేసిన హీరోయిన్లు సైతం ఆయనకు వ్యతిరేఖంగా నయనతార షేర్ చేసిన పోస్టుకు మద్దతు తెలపడం హాట్ టాపిక్ గా మారింది. ఇది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇప్పటికైతే దీనిపై ధనుష్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి, ఈ వివాదంలో అతనికి ఇండస్ట్రీ ఎలాంటి మద్దతు లభిస్తుందనేది తెలియడం లేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోకి ఫుల్ సపోర్ట్ కనిపిస్తోంది. నయన్ తన డాక్యుమెంటరీని ఛారిటీ కోసం చేయడం లేదు.. నెట్ ఫ్లిక్స్ తో కొన్ని కోట్లకు అగ్రిమెంట్ చేసుకునే చేసిందని, అందుకే పెళ్ళికి మీడియాని కూడా అనుమతించలేదని కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతగా ధనుష్‌కు తన సినిమాపై పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి, 3 సెకన్ల వీడియో ఉపయీగించినా అది కాపీ రైట్ కిందికే వస్తుందని అంటున్నారు.
అయినా ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాని 6 కోట్లలో తీయాలని అనుకుంటే, నయన్-విగ్నేష్ కారణంగా 16 కోట్ల బడ్జెట్ అయిందని.. సినిమా హిట్టయినా నిర్మాతగా ధనుష్ కు నష్టాలే మిగిలాయని, అలాంటిది ఇప్పుడు వాళ్ళిద్దరికీ డబ్బులు తెచ్చిపెట్టే డాక్యుమెంటరీలో ఆయన సినిమా విజువల్స్ వాడుకోడానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ఆయన క్యారక్టర్ ను దెబ్బ తీయడానికే ఇలా ఓపెన్ లెటర్ రాసిందంటూ విరుచుకు పడుతున్నారు. మూవీ ప్రమోషన్స్ కు రాకుండా నిర్మాతలను ఇబ్బందిపెట్టే నయనతార.. ఇలా నీతులు చెప్పడం ఏమీ బాగాలేదని అంటున్నారు. దీనికి నయన్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ధనుష్ నిర్మించిన ‘ఎదిర్ నీచ్చిల్’ సినిమాలో ఫ్రీగా ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో దీని గురించి ధనుష్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తున్నారు. ఈ విధంగా ధనుష్ Vs నయన్ గొడవల టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ గా నడుస్తోంది.