టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మ‌ళ్లీ ఓపెన్ ?

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇంత‌కుముందు ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2023-12-20 08:09 GMT

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ వినియోగం, ప్ర‌మాద‌క‌ర డ్ర‌గ్స్ వ్యాపారంపై నార్కోటిక్స్ బ్యూరో పూర్తిగా దృష్టి సారించడంతో ఇప్ప‌టికే పెద్ద డొంక క‌దిలింది. ఇటీవ‌ల కొన్ని వ‌రుస ఘ‌ట‌న‌ల్లో డ్ర‌గ్ డీల‌ర్లు ప‌ట్టుబ‌డ్డారు. ఐదారు రోజుల క్రితం తెలంగాణాలో టాలీవుడ్ కి చెందినవారే ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇంత‌కుముందు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసాక క‌మీష‌న‌ర్ తొలి పెద్ద ప్ర‌క‌ట‌న టాలీవుడ్ కి పెద్ద షాకింగ్ గా మారింది. సినీప్ర‌ముఖుల‌ను తీవ్రంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కొత్త‌ కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస రెడ్డి మొదట టాలీవుడ్‌ను టార్గెట్ చేయ‌డం ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ‌కు తెర తీసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మాట ఎక్కువ వినిపిస్తుంది అని, డ్రగ్స్ వాడకాన్ని టాలీవుడ్ ప్రోత్సహించ కూడదని క‌మీష‌న‌ర్ శ్రీనివాస రెడ్డి ఘాటుగా స్పందించ‌డంతో మ‌రోసారి తెలుగు చిత్ర‌సీమ‌లో డ్ర‌గ్స్ పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం దృష్టి సారిస్తోంద‌న్న చర్చా మొద‌లైంది.

భారీ డిమాండ్‌ ఉన్నందున హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా జరుగుతోందని కూడా శ్రీనివాస రెడ్డి అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు టాలీవుడ్ నాయకులు, సినీ పరిశ్రమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు కమిషనర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ డ్రగ్స్‌ను అడ్డుకునేందుకు పరిశ్రమలు కూడా చొరవ తీసుకుని సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సినిమా వర్గాల్లో మంచి, చెడు రెండూ ఉంటాయని ఆయ‌న అన్నారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని, అందుకే టాలీవుడ్ పెద్దలు దీనిపై దృష్టి సారించాలని శ్రీనివాస రెడ్డి సూచించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచిస్తూ వ్యాఖ్య‌లు చేసారు. డ్రగ్స్ వాడకంపై కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ తెలిపారు. టాలీవుడ్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు తెలుగు మీడియాల్లో ప్ర‌త్యేక క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. కేసీఆర్ ప్ర‌భుత్వం టాలీవుడ్ డ్ర‌గ్ దందాను లైట్ తీస్కుంటే, రేవంత్ సార‌థ్యంలోని కాంగ్రెస్ దీని భ‌ర‌తం ప‌ట్ట‌బోతోందంటూ ప్ర‌చారం సాగుతోంది.

మునుముందు తెలుగు చిత్ర‌సీమ‌లో డ్ర‌గ్స్ వినియోగాన్ని అడ్డుకునేందుకు రేవంత్ ప్ర‌భుత్వం వెన‌కంజ వేయ‌ద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతోనే టాలీవుడ్ లో ఈ దందా సాగుతోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న‌ట్టు కూడా క‌థ‌నాలొస్తున్నాయి. పాత కేసుల్ని తిర‌గ‌తోడి మ‌ళ్లీ డ్ర‌గ్స్ లో ఉన్న‌వారంద‌రినీ పిలిపించి విచారిస్తార‌ని కూడా కొన్ని మీడియాలు తామ‌ర‌తంప‌ర‌గా క‌థ‌నాలు అల్లుతున్నాయి. ఈ స‌న్నివేశాన్ని బ‌ట్టి సినీపెద్ద‌లు అలెర్ట్ అవ్వాల్సి ఉంటుంద‌ని కూడా కొంద‌రు సూచిస్తున్నారు. ఇంత‌కుముందులా య‌థేచ్ఛ‌గా డ్ర‌గ్స్ వినియోగం లేదా డ్ర‌గ్స్ విచ్చ‌ల‌విడి వ్యాపారం కుద‌ర‌ద‌ని కూడా కొంద‌రు అంచ‌నాలు వెలువ‌రిస్తున్నారు. మునుముందు ఏం జ‌ర‌గ‌బోతోందో వేచి చూడాలి.

Tags:    

Similar News