అఖండ 2 కోసం హిమాలయాల్లో బోయపాటి రెక్కీ

సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచే సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలని భావిస్తున్నారు.;

Update: 2025-03-01 11:52 GMT

బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి అఖండ గర్జనను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 2021లో అఖండ విజయం సాధించడంతో, దాని సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు అఖండ 2 మరింత గ్రాండ్‌గా, విశ్వవిజేత స్థాయిలో తెరకెక్కించేందుకు బోయపాటి శ్రీను పవర్ఫుల్ ప్లానింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన హిమాలయాల్లో ఓ ప్రత్యేకమైన రెక్కీ చేపట్టారు. సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచే సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలని భావిస్తున్నారు.

అఖండ సిరీస్‌లో బాలకృష్ణ నటనకు ఓ ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అఘోర గెటప్‌లో ఆయన ఫ్యాన్స్‌కు పూనకాలే తెప్పించారు. ఇప్పుడు అఖండ 2లో కూడా అఘోర వేషధారణలో మరింత పవర్‌ఫుల్ పాత్రతో బాలయ్య కనిపించనున్నారు. ఈసారి కథను మరో లెవెల్ కు తీసుకెళ్లేలా, అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను తెరకెక్కించేందుకు బోయపాటి శ్రీను హిమాలయాల్లో చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు.

ఇంతకు ముందు భారతీయ సినిమాల్లో ఇంత విభిన్నమైన లొకేషన్లు వాడి ఉండరని అంటున్నారు. హిమాలయాల్లో షూట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. విపరీతమైన వాతావరణ మార్పులు, భౌగోళిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఆ లోకేషన్లు అఖండ 2కు మేజర్ అసెట్ అవుతాయని టీమ్ నమ్మకంగా ఉంది. అంతేకాదు, ఇటీవల మహాకుంభమేళా సందర్భంగా కూడా చిత్రబృందం కొన్ని కీలకమైన విజువల్స్‌ను షూట్ చేసింది. ఈ రేంజ్‌లో హై స్కేల్ విజువల్స్ ఉండే సినిమా బాలయ్య కెరీర్‌లో ఇదే మొదటిసారి.

అఖండ 2లో బాలకృష్ణతో పాటు ఆది పినిశెట్టి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరిద్దరి పాత్రలు కథలో మలుపు తిప్పేలా ఉండబోతున్నాయి. ఆది ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిపాడు. ఇక సంజయ్ దత్ కూడా హై వోల్టేజ్ క్యారెక్టర్ చేస్తారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినీ సమర్పణలో, రామ్ ఆచంట - గోపీ ఆచంటల 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బోయపాటి శ్రీను, ఇప్పుడు అఖండ 2తో మరింత అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. హిమాలయాల్లో జరిగే ఈ గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుందని ఇప్పటికే చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News