గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో టాలీవుడ్ మ్యానియా.. 17 ఏళ్లలో ఎంతో ఛేంజ్..
వరల్డ్ వైడ్ గా ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాయోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు.. ఇప్పుడు తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి సినిమా వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాయోనని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలా కొన్నేళ్లుగా టాలీవుడ్ చిత్రాలు సినీ ఇండస్ట్రీని ఏలుతున్నాయనే చెప్పాలి.
అదే సమయంలో తెలుగు సినిమాలతో పాటు నటీనటులకు ఎన్నడూ లేనంత గౌరవం లభిస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్.. ఏదో విధంగా కచ్చితంగా తెలుగులో వర్క్ చేయాలని ఫిక్స్ అయిపోతున్నారు. అనుకున్నట్లుగా టాలీవుడ్ చిత్రాల్లో సందడి చేస్తున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీ క్రేజ్ పీక్స్ కు చేరిపోయిందనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
అయితే 2007లో జరిగిన తెలుగు సినీ వజ్రోత్సవ వేడుకలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపరమైన స్పీచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. వజ్రోత్సవానికి కొద్ది రోజుల ముందు జరిగిన గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల గ్యాలరీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ పిక్స్ లేకపోవడం బాధ కలిగించిందని చెప్పారు. ముంబై, ఢిల్లీ, గోవా తదితర ప్రాంతాల్లో రావాల్సిన గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అబద్ధం లేదని చెప్పాలి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ కు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అదే సమయంలో ఇప్పుడు గోవాలో 55వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈసారి టాలీవుడ్ కు ఎనలేని గౌరవం లభిస్తోంది. అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి, స్వప్న దత్, ప్రియాంక దత్, తేజ సజ్జా సహా అనేక మంది తెలుగు సెలబ్రిటీలు వేడుకకు హాజరయ్యారు.
అక్కడ వారు మాట్లాడుతున్నప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. టాలీవుడ్ స్థాయి ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. అయితే నిన్న సాయంత్రం ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు నిర్వహించిన రోడ్ షోలో బాహుబలి, ఆదిపురుష్ సినిమాల్లోని ప్రభాస్ పోషించిన పాత్రల భారీ విగ్రహాలు ప్రదర్శించారు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ రోడ్‌షోలో తెలుగు హీరో పాత్రల విగ్రహాలు ప్రదర్శించడం ఇదే తొలిసారి.
రోడ్ షోకు సంబంధించిన పిక్స్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. 17 ఏళ్ల క్రితం చిరంజీవి ఆవేదనకు ఇప్పుడు సరైన ఫలితం లభించిందని నెటిజన్లు చెబుతున్నారు. ఒక్క ఫోటో లేని చోట.. ఇప్పుడు అంత గౌరవం లభించిందంటే.. తెలుగు సినీ స్థాయి ఏంటో అర్థమవుతుందని అంటున్నారు. భవిష్యత్తులో తెలుగు సినిమా ఖ్యాతి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.